Hyderabad Traffic: హైదరాబాద్ నగరవాసులకు అదిరిపోయే శుభవార్త. నగరం ట్రాఫిక్ సమస్య ఎంతగా ఇబ్బంది పెడుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ప్రముఖ టెక్ దిగ్గజం ‘గూగుల్’ ఇండియా ప్రతినిధులను సందర్శించారు. తాజాగా ఓ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పనితీరును గూగుల్ ప్రతినిధులకు వివరించారు. రియల్-టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అధునాతన సర్వైలెన్స్, డేటా అనలిటిక్స్, గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా ట్రాఫిక్ జామ్ హాట్‌స్పాట్లను గుర్తించడంపై ప్రస్తుత వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ నిపుణులు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ డేటాను సమగ్రంగా అనుసంధానించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వాహనాల సంఖ్యను బట్టి ఆటోమెటిక్‌గా నియంత్రించడం, రియల్-టైమ్ పోలీస్ పేట్రోలింగ్ వాహనాల ట్రాకింగ్, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై దృష్టి సారించారు. అలాగే క్లౌడ్ సొల్యూషన్లను ఉపయోగించి డేటా స్టోరేజ్‌ను మెరుగుపరచడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను 30 రోజుల పరిమితికి మించి సేవ్ చేయడం, AI ఆధారిత డేటా విశ్లేషణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థంగా అభివృద్ధి చేసేందుకు గూగుల్, తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది.