- రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది రేవంత్
- కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్న సవాల్ ఏమైంది?
- రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆగస్ట్ 15 లోగా రైతు రుణమాఫీతోపాటూ ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. తాను గతంలో మాట్లాడిన వీడియోలు రెడీగా ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వెన్ను చూపించి పారిపోవడం రేవంత్ రెడ్డి అలవాటేనని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది ముఖ్యమంత్రేనన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది ఆయనేనంటూ విమర్శించారు.
నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాదన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తదన్నారు. పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదని స్పష్టం చేశారు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనన్నారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.