– ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు
– పల్నాడులో వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శంకుస్థాన
ఇదే నిజం, ఏపీ బ్యూరో: పల్నాడుకు కృష్ణా జలాలు అందించబోతున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారన్నారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని సీఎం పేర్కొన్నారు. ‘ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నాం. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశాం. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించాం. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం’అని సీఎం చెప్పారు.
సంక్షేమాన్ని ఆపలేదు
ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదని జగన్ తెలిపారు. ‘చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేదు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?.మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాది. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. పొత్తులను మేం నమ్ముకోలేదు. నా ధైర్యం ప్రజలు.. అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదు’అని సీఎం జగన్ పేర్కొన్నారు.