– వైఎస్ పాలన ఓ మార్క్
– నన్ను తిట్టేందుకు జోకర్లు వస్తున్నారు
– సాక్షిలో నాకు వాటా ఉంది
– ఆంధ్రరాష్ట్రం నా పుట్టిళ్లు .. అందుకే ఇక్కడికి వచ్చా
– ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఇదేనిజం, ఏపీ బ్యూరో: తనలో ఉన్నది నాన్న వైఎస్సార్ రక్తమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తాను ముమ్మాటికి వైఎస్ షర్మిలా రెడ్డినేనని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం తన పుట్టిళ్లు కాబట్టే ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. సోమవారం కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ పాలన అంటే ఓ మార్క్ అని పేర్కొన్నారు. సాక్షి మీడియా సంస్థలో తన వాటా ఉందని చెప్పారు. ఎవరెన్ని నిందలు వేసినా తాను వైఎస్ షర్మిలా రెడ్డినేనన్నారు. తనపై నిందలు వేసేవారిపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్ తన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించారన్నారు. ఆయన పాలనలో వైఎస్సార్ పథకం అందని గడప లేదని చెప్పారు. పార్టీలకతీతంగా అందరూ పథకాలు పొందారని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్ అని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. తన మీద సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన నాయకులతో పెయిడ్ ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.