Homeహైదరాబాద్latest Newsఆ Video చూసి చాలా బాధపడ్డా

ఆ Video చూసి చాలా బాధపడ్డా

– అరేబియా సముంద్రంలో వ్యర్థాల డంపింగ్​పై ఆనంద్ మహీంద్ర ట్వీట్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ.. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. కానీ, ఈ సారి ఓ వైరల్‌ వీడియోపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని చూసి తానెంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద అరేబియా సముద్రంలో కొందరు వ్యర్థాలను పడేశారు. గోనె సంచుల నిండా చెత్తను తీసుకువచ్చి పట్టపగలు అందరూ చూస్తుండగానే సముద్రంలో దాన్ని పడేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది. పర్యావరణానికి హాని తలపెట్టే విధంగా వారు ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అంతేకాకుండా, అతడికి ముంబయి ఘన వ్యర్థాల నిర్వహణ సంస్థ రూ. 10 వేల జరిమానా విధించింది. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో చెత్తను పడేయడంపై ఆనంద్‌ మహీంద్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ వీడియోను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. పర్యావరణం పట్ల పౌరుల దృక్పథం మారకపోతే.. నగర జీవన నాణ్యత మెరుగుపడదు’అని ట్విట్టర్​లో ట్వీట్ చేశారు. అంతేకాకుండా, తన పోస్టుకు ఆ వీడియోను కూడా జత చేశారు. సముద్ర జలాలను కలుషితం చేయడంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజల ఆలోచనా విధానాలపైనే నగర జీవన నాణ్యత మెరుగుపడటం ఆధారపడి ఉంది’ అని ఒకరు.. ‘‘పర్యావరణానికి హాని కలిగించే వైఖరి మారాలి. బాధ్యతగా నడుచుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి’ అంటూ మరొకరు పోస్టు పెట్టారు.

Recent

- Advertisment -spot_img