ఇదే నిజం ప్రతినిధి, మెదక్/కామారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ గత పదేండ్లలో తెలంగాణా కు అన్యాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో సబ్ కాసాత్.. సబ్ కా వికాస్’ కాలేదని దేశం సత్యనాశ్ అయ్యిందని వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి కామారెడ్డి, మెదక్ లలో జరిగిన రోడ్ షో, బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ముందు 150 నినాదాలు చెప్పిండని, అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ నినాదమేమో గాని దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. దేశానికి బీజేపీ ప్రభుత్వ చేసిందేమి లేదని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా సామన్యుల నడ్డి విరిచారని ఆక్షేపించారు.
అబ్ కి బార్ 400 పార్ కాదని, పెట్రోల్ ధర 400 పార్ అవుతుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తానని చెప్పాడని గుర్తు చేశారు. అయితే, నిజామాబాద్ లో బీజేపీ ఉన్నందున ఉమ్మడి జిల్లా ప్రజలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు జమయ్యాయట నిజమేనా అంటూ కేసీఆర్ ర్యాగింగ్ చేశారు. రాష్ట్రంలో రైతుబంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించిందని, తాను రంగంలోకి దిగగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని తెలిపారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని దోక బాజి మాటలు చెప్పి సి ఎం రేవంత్రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చాడని గుర్తు చేశారు. రైతులకు రూ.2 లక్షల నగదు చేసేంత సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, మీరు ఊరు కుంటారా అని ప్రశ్నించారు . రాష్ట్ర లో 33 జిల్లాలు ఏర్పాటు చేయగా, ప్రతి ఒక్క జిల్లాకు నవోదయ మంజూరు చేయాలని తాను మోడీకి వంద ఉత్తరాలు రాసినా స్పందించలేదన్నారు. ఒక్క మెడికల్ కళాశాల ను మంజూరు చేయలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల లో బీజేపీ, కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పి, బిఆరెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బ్యాన్స్ వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమడుగు సురేందర్, గంప గవర్ధన్, ముజీబుద్దీన్,బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే.. హామీలు అమలవుతాయి
కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్‌ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తేనే అందర్నీ కాపాడగలరని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావంతుడు, తెలివితేటలు ఉన్నవాడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డి డబ్బుల కోసం, స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని, మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమతో వచ్చారని స్పష్టం చేశారు. మెదక్ బీజేపీ అభ్యర్థి నూటికి నూరు అబద్ధాలు మాట్లాడతారని కేసీఆర్ విమర్శించారు. మోదీది ఎంత గ్యాసో.. రఘునందన్‌రావుది కూడా అంతే గ్యాస్.. అందులో ఏ అనుమానం లేదని అన్నారు.
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 55 వేల ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయిండని గుర్తు చేశారు. దుబ్బాక అసెంబ్లీకే చెల్లని రూపాయి మెదక్ పార్లమెంటులో చెల్లుతదా అని ప్రశ్నించారు. రఘునందన్‌రావును తుక్కుతుక్కుగా ఓడగొట్టి బుద్ధి చెప్పాలని కోరారు. మీరు ఇష్టమైన హామీలు ఇచ్చి మోసం చేస్తే.. నమ్మడానికి ఎడ్డోల్లం కాదని చెప్పాని స్పష్టం చేశారు. తెలంగాణ మళ్లొకసారి పిడికిలి బిగించి పోరాటానికి దిగాలని పిలుపునిచ్చారు. తాను కూడా మెదక్ జిల్లా బిడ్డనే అని కేసీఆర్ తెలిపారు. మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసిన్నో మీ అందరికీ తెలుసన్నారు. ఘనపురం ఆనకట్టను ఏ విధంగా బాగు చేసినమో మీకు తెలుసు. హల్దీ వాగు మీద ఎన్ని చెక్‌డ్యామ్‌లు కట్టినమో మీకు తెలుసు. అని అన్నారు.