ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల వెకిలి చేష్టలను యావత్ తెలంగాణ సమాజం, మహిళా లోకం అందరూ కూడా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రైతులందరికీ రుణమాఫీ చేయకపోగా రైతుల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో కేటీఆర్ మాటలను వక్రీకరిస్తూ వారి యొక్క దిష్టిబొమ్మ దహనాలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కేటీఆర్ కు మహిళల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మహిళల అభ్యున్నతికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని పేర్కోన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ పార్టీ యూత్ పక్షాన ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేష్టలు గుండాల తీరుగా ఉన్నదని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వెనకఉండి కార్యకర్తలను ఉసిగొలుపుతూ దాడులకు ప్రోత్సహిస్తున్న తీరును సభ్య సమాజం సహించదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, చావుతప్పి కన్నులు లొట్ట పోయినట్టు వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కంచం నర్సింలు, ఎండి.జహంగీర్, కోడె శ్రీనివాస్, వంగూరి దిలీప్, గున్నాల రాజ్ కుమార్ గౌడ్, గూడూర్ శ్రీనివాస్, సంజీవ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.