Homeక్రైంచేయనికి నేరానికి ఇరుక్కుని జైలుకు వెళ్లి..

చేయనికి నేరానికి ఇరుక్కుని జైలుకు వెళ్లి..

– బెయిల్​పై బయటికొచ్చి తన కేసు తానే వాదించుకొని

– హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ యూపీ వాసి

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: ఎలాంటి తప్పు చేయకున్నా ఒక్కోసారి కొంతమంది కొన్ని కేసుల్లో నిందితులుగా ఇరుక్కుంటుంటారు. విచారణలో భాగంగా కొన్ని నెలల పాటు జైలులో కూడా గడపాల్సి వస్తుంటుంది. అలాంటి వారి బాధ వర్ణనాతీతం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తులు తీవ్రంగా కుంగిపోతుంటారు. మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తారు. చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటుంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్​కు చెందిన అమిత్‌ చౌదరీ అనే వ్యక్తి కథ మాత్రం అందుకు భిన్నమైంది. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం అమిత్‌ చౌదరీ అనే వ్యక్తి చేయని నేరానికి నిందితుడిగా ఇరుక్కున్నారు. మీరట్​లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పైగా గ్యాంగ్‌స్టర్ ముద్ర కూడా వేశారు. దీంతో ఆయన జీవితంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. హత్యకు గురైనవారు పోలీసులు కావడంతో అప్పట్లో అందరి దృష్టి ఈ కేసుపైనే ఉండేది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి ఆదేశించారు. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్‌ మీరట్​లో లేరు. షామ్లీ పట్టణంలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో ఆయన్ని కూడా చేర్చారు. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కైల్‌ అనే వ్యక్తికి చెందిన గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో అమిత్‌ రెండేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.


జైలర్ సహకారంతో ఎల్​ఎల్​బీ చేసి..


తన జీవితంలో వచ్చిన ఈ సంక్షోభాన్నే అమిత్‌ సదావకాశంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. న్యాయ విద్య అభ్యసించి తన కేసును తానే వాదించుకొని నిర్దోషిగా బయటపడ్డారు. ఓ రైతు కొడుకైన ఆయన.. జైలులో వచ్చిన ప్రలోభాలకూ లొంగకపోవడం గమనార్హం. జైలు జీవితం గడుపుతున్న సమయంలో అనేక మంది తనను వారి గ్యాంగ్‌లలో చేరాలని ప్రోత్సహించారని అమిత్‌ స్వయంగా చెప్పారు. కానీ, తాను వాటిని తిరస్కరించానన్నారు. ఈ క్రమంలో ఓ జైలర్‌ కూడా తనకు సహకరించారన్నారు. తనను గ్యాంగ్‌స్టర్‌లు ఉండే బ్యారక్‌లో కాకుండా వేరే దాంట్లోకి మార్చారని తెలిపారు. రెండేళ్ల జైలు జీవితం తర్వాత అమిత్‌ 2013లో విడుదలయ్యారు. ఎట్టకేలకు ఈ కేసులో నిర్దోషిగా బయటపడాలని నిశ్చయించుకున్నారు. తద్వారా తన కుటుంబం తలెత్తుకుని తిరిగేలా చేయాలనుకున్నారు. మనసులోని కుంగుబాటును పక్కనబెట్టి.. న్యాయ విద్యను అభ్యసించడంలో నిమగ్నమయ్యారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. బార్‌ కౌన్సిల్‌ పరీక్షలో కూడా పాసయ్యారు. చట్టపరమైన అంశాల్లో వచ్చిన పట్టుతో తన కేసును తానే టేకప్‌ చేశారు. పోలీసులు మొదట్లో ఎలాంటి స్టేట్‌మెంట్లు, ఆధారాలు సేకరించకపోవడంతో ఈ కేసు నత్తనడకన సాగిందని అమిత్‌ తెలిపారు. తన న్యాయ విద్య పూర్తయ్యే వరకు అసలు కేసులో ఎలాంటి పురోగతి రాలేదని పేర్కొన్నారు. దీంతో పూర్తిగా ఈ కేసు పైనే దృష్టి సారించి కోర్టులో వాదనలు వినిపించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఓసారి తనని అరెస్టు చేసిన పోలీసు అధికారి బోనులో నిలబడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సందర్భంలో న్యాయవాదిగా కేసు వాదిస్తున్న తనను సదరు అధికారి గుర్తుపట్టకపోవడం జడ్జిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించారు. దీంతో కేసులో నిందితులను ఎంత గుడ్డిగా చేర్చారో న్యాయమూర్తికి అర్థమైందన్నారు.


13 మంది నిర్దోషులే..


అలాగే తన ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారని అమిత్‌ తెలిపారు. ఇలా ఈ కేసులో తనతో పాటు మొత్తం 13 మందిని కోర్టు ఇటీవలే నిర్దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు నేరస్థులైన ముగ్గురిలో సుమిత్‌ కైల్.. 2013లో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. నీతు అనే మరో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తి ధర్మేంద్ర ఇటీవలే క్యాన్సర్‌తో మరణించాడు. భారత సైన్యంలో సేవలు అందించాలన్న తన కలలు ఈ కేసుతో చెదిరిపోయాయని అమిత్‌ వాపోయారు. కానీ, న్యాయవాది రూపంలో దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. అన్యాయానికి గురైనవారికి ఈ వృత్తితో అండగా నిలుస్తానన్నారు. క్రిమినల్‌ జస్టిస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని తెలిపారు.

Recent

- Advertisment -spot_img