Idenijam, Webdesk : మార్కులు పొందేందుకు కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాస్తుంటారు. జవాబు పత్రాల్లో డబ్బులు పెడుతుంటారు. బతిమాలుతుంటారు. వేడుకొంటారు. మరికొందరు ఓం అని , ఇంకా దేవుళ్ల పేర్లు ప్రస్తావిస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రై చేస్తుండటం చూశాం. పేపర్లు దిద్దేవాళ్లకు వార్నింగ్ కూడా ఇస్తుంటారు మరికొంతమంది. అదేరీతిలో ఓ విద్యార్థి చేశాడు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కాదు..కాదు..స్పెషల్ గా ఉంది. ఇంతకీ ఆ విద్యార్ధి ఏం చేశాడంటే…
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. విద్యార్థుల జవాబుపత్రాల మూల్యంకనం ప్రారంభమైంది. మూల్యంకనం చేస్తున్న సమయంలో ఒక ఉపాధ్యాయుడికి వింత అనుభవం ఎదురైంది. పేపర్ దిద్దే సమయంలో విద్యార్థి రాసిన సందేశం చూసి ఆశ్చర్యపోయాడు. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని జవాబుపత్రంలో రాసి సార్‌కు వార్నింగ్ ఇచ్చాడు.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం చేస్తున్నారు. తెలుగు పరీక్షకు సంబంధించి ‘రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి’ అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక విద్యార్థి సరైన సమాధానం రాయలేదు. మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. వెంటనే ఆ జవాబు పత్రాన్ని ఉన్నత అధికారులకు చూపించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదంతా సరే కానీ ఆ విద్యార్థి పరీక్ష మాత్రం బాగా రాశాడు. వందకు 70 మార్కులు వచ్చాయి. విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించడం కోసం ఇలా రాశాడని అధికారులు భావించారు. ప్రస్తుతం గ్రేడ్, ర్యాంకులతోనే ప్రతిభను గుర్తిస్తుండటంతో ‘తెలుగు’లో అత్యధిక మార్కుల కోసం ఇలా సార్‌కు జవాబుపత్రంలో వార్నింగ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.