సినీ నేపథ్యం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతీ హాసన్. కమల్ హాసన్ నట వారసత్వం ఉన్నా తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు దక్కించుకుంది. తన మల్టీ ట్యాలెంట్‌తో దూసుకుపోయింది. 2000 ఏడాదిలో వచ్చిన హే రామ్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండో సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా సింగింగ్‌తో కూడా తనలోని మల్టీ ట్యాలెంట్‌ను బయటపెట్టిందీ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’తో పాటు చెన్నై స్టోరీ అనే మరో సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది. కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ చిత్రాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఈ రెండింటిలో మీకు ఏది సంతృప్తిని ఇస్తుందన్న ప్రశ్నకు శృతీ స్పందిస్తూ..
‘మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీసులో ఉండలేం.. అలాగే అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండలేం. ఇదే సినిమాల విషయంలోనూ వర్తిస్తుంది. నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు సెట్లో ఉండే అనుభవం ఒకలా ఉంటుంది. అలాగే ఇతర తారల చిత్రాల్లో భాగమైనప్పుడు కలిగే అనుభవం దానికి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ నా కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది నా చిత్రమైనా.. వేరే తారలతో తెర పంచుకుంటున్న సినిమా అయినా నటిగా నా పాత్రకు న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం శ్రమపడతా’ అని చెప్పుకొచ్చింది. ఇక తనకు కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన ఈ చిన్నది.. మనం కష్టపడి పనిచేశామని తెలిసి మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదని చెబుతోంది. రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తుందని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా సలార్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శృతీ హాసన్ ప్రస్తుతం రెండు భారీ మూవీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.