ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్‌కు వచ్చిన ఆయనకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్‌లను సీఎం పరిశీలించారు. అధికారుల విధుల గురించి తెలుసుకుని, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు బడ్జెట్ కేటాయించిన నేపథ్యంలో దానిపై చర్చించారు. డ్రగ్స్ నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. లేకపోతే అవి యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతి గురించి నార్కోటిక్స్ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సరఫరా చైన్ బ్రేక్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అసలు వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని అన్నారు. కేసుల్లో సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయమని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేసేవారిని ప్రోత్సహించాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం సమకూరుస్తుందని వెల్లడించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి, ఇతర రాష్ట్రాలకు టీఎస్ న్యాబ్ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.
హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయొద్దు..
హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఇతర విభాగాల అధికారులతోనూ సీఎం సమీక్ష చేపట్టారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుకు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలన్నారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ‘జూన్ 4లోగా పూర్తి ప్లానింగ్ రెడీ చేయండి. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద బారికేడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలి. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్లానింగ్ రెడీ చేయాలి. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా.. పవర్ మేనేజ్‌మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలి’ అని సీఎం దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావారణ శాఖ అధికారుల నుంచి పలు ప్రతిపాదనలను సీఎం తీసుకున్నారు. పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు.
సమావేశంలో నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.