- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఫేక్ న్యూస్
- కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని.. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
- వారికి లీగల్ నోటీసులు ఇస్తాం
- 24 ఏండ్లలో ఎన్నో కుట్రలు ఎదుర్కున్నాం
- బీఆర్ఎస్ పడిలేచిన పార్టీ
- ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీలో విలీనం కాబోతున్నదంటూ కొన్ని వార్త సంస్థలు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. అటువంటి సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ తట్టుకొని నిలబడుతుందని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంతా ఫేక్ ప్రచారం అని కొట్టి పారేశారు. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏండ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము’ అని కేటీఆర్ తెలిపారు.
కుట్రలు తట్టుకున్నాం
బీఆర్ఎస్ ఎన్ని కుట్రలను తట్టుకొని నిలబడిందన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని పోరాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ తేల్చిచెప్పారు.