రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరబట్టిన కొడంగల్ లగచర్ల గిరిజన బిడ్డలకు సంఘీభావంగా ఈ రోజు మానుకోటలో జరగాల్సిన శాంతియుత మహా ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించి 144 సెక్షన్ విధించడం ముమ్మాటికీ పిరికిపంద చర్య అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.భవిష్యత్తులో కనిపిస్తే కాల్చివేతకు కూడా వెనకాడరన్న మాట అని తెలిపారు. నాడు శ్రీలంకలో రాజపక్ష సోదరులు, బంగ్లాదేశ్ లో హసీనా, టునీషియాలో బెన్ అలీ, ఈజిప్ట్ లో హోస్నీ ముబారక్ లు కూడా ఈ విధంగా నే విర్రవీగారు. తరువాత వాళ్లకేమైందో అందరికీ తెలుసు అని గుర్తుచేశారు. నిన్న డోర్నకల్ కాంగ్రేసు ఎమ్మెల్యే ఒక గిరిజనుడై ఉండి కూడా సాటి గిరిజనుల భూములను ‘తన అల్లుడి కళ్లలో ఆనందం’ కోసం సీఎం కబ్జా చేస్తుంటే, ఆయనకే వంతపాడడం నిజంగా సిగ్గుచేటు. సేవాలాల్ మహారాజ్ గారు ప్రవచించిన “ఏక్ జాత్, ఏక్ సాత్, ఏక్ వాత్” ను అప్పుడే మరచిపోయిండ్రా? అని అన్నారు. ఆ లగచర్ల జ్యోతి, సుశీల, కిష్టు బాయిలకు (చెల్లెలకు) ఉన్న తెగువ, ఆత్మగౌరవం లో కనీసం ఇసుమంతైనా ఈ లీడర్లకుంటే చాలా బాగుంటుండె. కిష్టుబాయి వీడియో చూసినంక కూడా మీకు రక్తం మరగడం లేదా రామచంద్రు? అని నిలదీశారు. గిరిజనుల భూమి హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న కేటీఆర్ గారి మీద రాళ్ల తో దాడి చేస్తామని సాక్షాత్తు ఎమ్మెల్యే నే చెప్పడం మీ దిగజారుడు బానిస రాజకీయాలకు నిదర్శనం. అసలు మీరు నిలదీయాల్సింది ఎవరిని ? అధికారం మదంతో “మీరు ఢిల్లీకే కాదు చంద్రమండలం పోయినా నేను చేసే పని చేసి తీరుతా” అని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదా మీరు నిలదీయాల్సింది? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.