Increasing intrusion in Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఊపందుకొంటున్న ఉగ్రమూకల కార్యకలాపాలతో పాకిస్థాన్.. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కశ్మీర్‌లోకి ఉగ్రతండాల చొరబాట్లు రెండు నెలలుగా గణనీయంగా పెరుగుతున్నాయి.
భారత అంతర్గత భద్రతకు పెనుముప్పు పొంచి ఉందా? అఫ్గానిస్థాన్‌లో తమ పెంపుడు తాలిబన్లకు పట్టంకట్టిన పాకిస్థాన్- ఇండియాలో నెత్తుటి నెగళ్లను రాజేసే కుయుక్తులను ముమ్మరం చేసిందా? జమ్ముకశ్మీర్‌లో ఊపందుకొంటున్న ఉగ్రమూకల కార్యకలాపాలతో కమ్ముకొంటున్న భయసందేహాలివి!
ఐఎస్‌ఐ కనుసైగ చేయగానే కశ్మీర్ లోయలో భారీ దాడులకు పాల్పడటానికి దాదాపు రెండొందల మంది సంసిద్ధంగా ఉన్నారన్న కథనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
ఆ ముష్కరుల్లో స్థానికుల కంటే విదేశీయుల సంఖ్యే అధికమని భద్రతా దళాలే చెబుతున్నాయి.
కశ్మీర్‌లోకి ఉగ్రతండాల చొరబాట్లు రెండు నెలలుగా గణనీయంగా పెరుగుతున్నాయి.
బండిపోరా, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో ఆ మేరకు వాటి కదలికలు జోరందుకొంటున్నాయి.
కశ్మీర్ వ్యవహారాల్లో తమకు తాలిబన్లు తోడ్పడతారని పాక్ అధికారపక్ష నేతలు మరోవైపు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
అఫ్గానిస్థాన్ నుంచి రష్యాతో పాటు కశ్మీర్‌కు ఉగ్రవాదం ఎగుమతి కావడం తథ్యమని ఇండియాలో ఆ దేశ రాయబారి నికొలాయ్ కుదాషెవ్ అంచనా వేస్తున్నారు.
సుశిక్షితులైన అఫ్గాన్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదముందంటూ కేంద్రమూ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
విదేశాలపై దాడులకు తమ గడ్డను నెలవు కానివ్వబోమంటూనే- కశ్మీరీల సమస్యలపై మాట్లాడే హక్కు తమకు ఉందని తాలిబన్లు నోరు పారేసుకొంటున్నారు. తదుపరి ‘లక్ష్యాల’ జాబితాలో కశ్మీర్‌నూ చేర్చిన అల్‌ఖైదాతో పాటు ఐఎస్‌ఐఎస్ సైతం ఇండియాపై గురిపెట్టిందన్నది వాస్తవం! ఆ విధ్వంసక ముఠాల ప్రోద్బలంతో భయంకర కుట్రలకు తెరతీస్తున్న కొందరు ఇటీవల శ్రీనగర్, అనంత్‌నాగ్, లఖ్‌నవూల్లో భద్రతాధికారులకు చిక్కారు.
అటు బంగ్లాదేశ్ నుంచి జమాతుల్ ముజాహిదీన్ ముష్కరులు సైతం దేశంలోకి యథేచ్ఛగా చొరబడుతున్నారు.
సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, దళాల మోహరింపులతో పాటు దేశవ్యాప్తంగా నిఘా కట్టుదిట్టమైతేనే భారతావని సురక్షితమవుతుంది.
విద్రోహులను ఉక్కుపాదంతో అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు సమష్టిగా కదంతొక్కాల్సిన కీలక తరుణమిది!
1980 నుంచే..
కశ్మీర్‌లో శాంతిభద్రతలను అఫ్గాన్ పరిణామాలు దశాబ్దాలుగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
1980 చివర్లో సోవియట్లతో ముజాహిదీన్ల పోరు ముగిశాకే కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు పెచ్చుమీరాయి.
తాలిబన్ల అరాచకత్వానికి అఫ్గాన్ అల్లకల్లోలమవుతున్న కాలంలో ఇక్కడ హింసోన్మాదం ప్రకోపించింది.
ఆ అయిదేళ్లలోనే (1996-2001) కశ్మీర్‌లో 17 వేల మందికిపైగా ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదంపై అమెరికా యుద్ధం ప్రకటించిన దరిమిలా రెండు దశాబ్దాల్లో దాదాపు 14 వేల మంది అసువులు బాశారు.
అఫ్గాన్ నుంచి అర్ధాంతరంగా వైదొలగుతూ అత్యాధునిక ఆయుధాలెన్నింటినో అమెరికా అక్కడే వదిలేసింది.
వాటిని తన కనుసన్నల్లోని ముష్కరులకు అందించి భారత సరిహద్దుల్లోకి పంపాలన్నది ఐఎస్‌ఐ దురాలోచనగా ప్రస్ఫుటమవుతోంది.
సీమాంతర ఉగ్రవాదానికి తోడు స్థానికంగా ఇంతలంతలవుతున్న విద్వేష భావజాల వ్యాప్తి సైతం కశ్మీరాన్ని కల్లోలభరితం చేస్తోంది.
ఇటీవల మరణించిన వేర్పాటువాద నేత గిలానీ భౌతిక కాయంపై పాక్ పతాకాన్ని కప్పారన్న వార్తలు కలకలం సృష్టించాయి.
అదే సరైన దారి
లోయలో వ్యూహం మార్చిన ఉగ్రవాదులు కొన్నాళ్లుగా ప్రధాన పార్టీల నేతలపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు.
వారి దుశ్చేష్టలపై ఆందోళన వ్యక్తంచేసిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా- జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాజాగా గళమెత్తారు.
ఆ మేరకు రాజకీయ పక్షాలతో చర్చలు కొనసాగిస్తూ జమ్ముకశ్మీర్‌లో శాంతిస్థాపనకు కేంద్రం కృషిచేయాలి.
అమాయకుల ఉసురుతీస్తున్న ఉగ్రవాదుల పీచమణుస్తూనే కశ్మీరంలో సర్వజనాభివృద్ధికి బాటలు పరవాలి.
ప్రతీప శక్తులపై విజయం సాధించడానికి- ప్రభుత్వం ఈ ద్విముఖ వ్యూహానికి కట్టుబడటం ఒక్కటే సరైన దారి!