Homeహైదరాబాద్latest NewsINDvsSA Final: సమరానికి సై.. నేడే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. వర్షం...

INDvsSA Final: సమరానికి సై.. నేడే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. వర్షం ముప్పు..రద్దయితే పరిస్థితేంటి..?

ఇదేనిజం, స్పోర్ట్ డెస్క్ : టీ20 వర‌ల్డ్‌క‌ప్-2024 టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ తుదిపోరులో శనివారం బార్బోడ‌స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో భార‌త్‌ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వ‌ర‌ల్డ్‌క‌ప్‌ నిరీక్షణ‌కు తెర‌దించాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన ఇప్పటికే బార్బోడ‌స్‌కు చేరుకుంది. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు మేనెజ్‌మెంట్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ ముందు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు ఎలాంటి గాయాల బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి శుక్రవారం జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను మేనెజ్‌మెంట్ ర‌ద్దు చేసింది. సెమీఫైన‌ల్‌కు, ఫైన‌ల్‌కు కేవ‌లం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండ‌డంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గురువారం జ‌రిగిన జ‌రిగిన సెకెండ్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. ముచ్చట‌గా మూడోసారి ఫైన‌ల్లో అడుగుపెట్టింది. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికా మాత్రం ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు త‌మ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నది. తొలిసారి ఫైన‌ల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.

ఈ మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు…
బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి. 99 శాతం మేఘావృతమై ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వానపడే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్’ రిపోర్ట్ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేమ శాతం కూడా అధికంగా ఉంటుందని, ఈదురు గాలులు వీయనున్నాయని అంచనా వేసింది. వర్షం పడుతూ తగ్గుతూ.. ఉరుములతో కూడిన గాలివాన పడొచ్చని ‘ఆక్యూవెదర్’ వెల్లడించింది.

మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే…
శనివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే ఆదివారం ఇరు జట్లు ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఆదివారం కూడా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ రిపోర్టులు అంచనా వేశాయి. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? అనే సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా రెండు రోజులు వర్షం పడి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం.. భారత్, దక్షిణాఫ్రికా రెండూ సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని ఇరు జట్లు గెలిచినట్టు ప్రకటిస్తారు.

Recent

- Advertisment -spot_img