న్యూఢిల్లీః ఇండియన్ ఆర్మీ ఎల్ఏసీని దాటొచ్చిందని.. పాంగాంగ్ సో సరస్సు సమీపంలో భారత బలగాలు గాల్లోకి కాల్పులు జరిపిందన్న చైనా ప్రకటనపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. చైనా ఆరోపణలను ఖండించింది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘సోమవారం నాటి ఘటన విషయానికి వస్తే.. చైనా బలగాలు ఎల్ఏసీ వెంబడి మా ఫార్వార్డ్ పొజిషన్ సమీపంలోకి రావడానికి ప్రయత్నించాయి. చైనా సైనికులను అడ్డుకోబోగా.. చైనా బలగాలు మమ్మల్ని భయపెట్టడానికి గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. సైనిక, దౌత్యపరమైన, రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. పీఎల్ఏ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది’’ అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
సైనిక బలగాల ఉపసంహరణకు, ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండి పడింది. ఇండియన్ ఆర్మీ ఎల్ఎసీ వెంబడి ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడలేదని.. ఫైరింగ్ సహా రెచ్చగొట్టే చర్యలకు దిగలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.