Homeఅంతర్జాతీయం#UNO: భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్, మద్దతిచ్చిన రష్యా, ఫ్రాన్స్

#UNO: భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్, మద్దతిచ్చిన రష్యా, ఫ్రాన్స్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి.

భారత్ అజెండా స్ఫూర్తి దాయకంగా ఉందని చెబుతూ రష్యా అభినందించింది.

ముఖ్యంగా, ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలను భారత్ అజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రముఖంగా ప్రస్తావించింది.

‘‘అధ్యక్ష పీఠాన్ని చేపడుతున్న భారత్‌కు అభినందనలు. భారత అజెండా చాలా బావుంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలకు సముచిత స్థానం కల్పించారు. సమర్థంగా, మంచి ఫలితాలనిచ్చే దిశగా భారత్ కృషి చేస్తుందని ఆశిస్తున్నా’’అని భారత్‌లోని రష్యా రాయబారి నికోల్ కుదాషేవ్ ట్వీట్‌చేశారు.

మరోవైపు ఫ్రాన్స్ కూడా భారత్‌కు అభినందనలు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

‘‘ఫ్రాన్స్ తర్వాత ఈ పదవిని భారత్ చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనెన్ ట్వీట్‌చేశారు.

ఉగ్రవాదంపై పోరాటం మీద దృష్టి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతున్న భారత్‌కు.. భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం రావడం ఇదే తొలిసారి.

2022 వరకు భారత్ ఈ పదవిలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి భద్రతల పరిరక్షణ, సముద్ర తీర భద్రత తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్ల భారత్ తెలిపింది.

ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ట్వీటర్ వేదికగా ఓ వీడియోలో వెల్లడించారు.

‘‘ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపై కూడా ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం’’అని ఆయన అన్నారు.

ఈ పదవిని చేపట్టడంలో చేసిన కృషికిగాను ఫ్రాన్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఆగస్టు పూర్తయిన తర్వాత, మళ్లీ వచ్చే ఏడాది డిసెంబరులో రెండోసారి అధ్యక్ష స్థానాన్ని భారత్ చేపడుతుంది. వచ్చే ఏడాది డిసెంబరుతో భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వ రెండేళ్ల పదవీ కాలం కూడా ముగుస్తుంది.

నిబంధనలు పాటిస్తారని ఆశిస్తున్నాం – పాకిస్తాన్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలను భారత్ పాటిస్తుందని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన తీర్మానాలను అమలు చేస్తారని భావిస్తున్నట్లు వివరించింది.

”ఈ నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ చేపడుతోంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన భద్రతా మండలి తీర్మానాలను వారికి ఒకసారి గుర్తుచేయాలని మేం అనుకుంటున్నాం”అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌధరి వ్యాఖ్యానించారు.

”భద్రతా మండలి సమావేశాల నిర్వహణ బాధ్యత అధ్యక్ష పీఠాన్ని చేపట్టే దేశంపై ఉంటుంది. అంతేకాదు అక్కడి నియమ నిబంధనలను వారు అనుసరించాల్సి ఉంటుంది”అని ఆయన వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img