– సాయంత్రం విడుదలయ్యే చాన్స్
– 52 రోజులుగా జైళ్లోనే చంద్రబాబు
– ఐదు షరతులతో బెయిల్
– రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు నో చాన్స్
ఇదేనిజం, హైదరాబాద్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర మంజూరైంది. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ వచ్చింది. రూ. లక్షతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు సూచించింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కూడా అవకాశం లేదు. మొత్తం ఐదు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని కోర్టు సూచించింది. నాలుగు వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఇక చంద్రబాబు నాయుడు 52 రోజులుగా జైళ్లోనే ఉన్నారు. ఆయన ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.