ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో తమ పై వరుసగా ఐదు విజయాలు సాధించిన పంజాబ్ రికార్డుకు చెన్నై చెక్ పెట్టింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలు మెరుగు పరుచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 26 బంతుల్లో46 పరుగులు చేసి టాప్ స్కోరర్ నిలిచాడు. అలాగే సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. అయితే ఈ క్రమంలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో కలిపి జడేజా ఖాతాలో 16 అవార్డులు చేరాయి. ఇంతకు ముందు ఈ రికార్డు సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. ధోనీ ఇప్పటివరకు 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. జడేజా, ధోనీ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, రుతురాజ్ గైక్వాడ్, మైకేల్ హస్సీ ఉన్నారు. రైనా 12 సార్లు, రుతురాజ్ 11 సార్లు, హస్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు.