గతేడాది ఫైనలిస్ట్‌లుగా నిలిచిన గుజరాత్ టైటాన్, చెన్నైసూపర్ కింగ్స్ నేడు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్లు తమ తమ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేశాయి. యువ కెప్టెన్ల నేతృత్వంలోని రెండు జట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్, చెన్నైని రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. గుజరాత్ 3, చెన్నై 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. చెన్నై గెలిచిన రెండు మ్యాచ్‌లు నాకౌట్ పోటీల్లో కావడం గమనార్హం. గతేడాది మొదటి క్వాలిఫైయర్‌లో, ఫైనల్‌లో గుజరాత్‌ను చెన్నై ఓడించింది.
మ్యాచ్ జరిగే చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగే రెండో మ్యాచ్ ఇది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత మ్యాచ్‌లో బెంగళూరు విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నైసూపర్ కింగ్స్ సునాయసంగా చేధించింది. రెండు జట్టలో బిగ్ హిట్లర్లు ఉండడంతో నేడు జరిగే మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. చెన్నైకి రవీంద్ర జడేజా, మహేష్ తీక్షణ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. గుజరాత్‌కు రషీద్ ఖాన్, సాయి కిషోర్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పేసర్లు కూడా సత్తా చాటుతారు. ఇదే పిచ్‌పై బెంగళూరుతో చెన్నై ఆడిన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 6 టీ20లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 5 మ్యాచ్‌ల్లో గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఒకేసారి గెలిచింది.