నేడు ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా, 6 గెలిచి 5 ఓడిపోగా.. ఇరు జట్ల ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇరు జట్లకు నేటి మ్యాచ్ కీలకం కానుంది. అయితే తొలి ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐపీఎల్‌లో రికార్డులను తిరగరాస్తూ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. నేడు లక్నోపై గెలవకపోతే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారుతాయి.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ జరిగే ఉప్పల్‌లో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా ఉప్పల్ రోడ్లన్నీ జలమయ్యాయి. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సైతం జలమయమైంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా.. భారీ ఎత్తులో నీళ్లు చేరాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్‌ను కూడా రద్దు చేసుకున్నాయి.