భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విమర్శలు గుప్పిస్తున్న రాయడు సంచలన ట్వీట్ తో వివాదానికి ఆజ్యం పోశాడు. ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించాడు. అసలేం జరిగిందంటే ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో CSKతో జరిగిన మ్యాచ్‌లో RCB గెలిచింది. ఈ విజయంతో చెన్నై ఇంటిముఖం పట్టగా, బెంగళూరు ప్లేఆఫ్ లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు చేసుకున్న తీరుపై రాయుడు వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆర్‌సీబీ కి టైటిల్ గెలిచిన అనుభూతి కలుగుతుందని అన్నాడు.
అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. దీంతో రాయుడు మరోసారి ఆర్సీబీపై విమర్శలు గుప్పించాడు. సంబరాలు, దూకుడు తో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని అన్నాడు. కిలక మ్యాచ్‌ల్లో విజయం సాధించాలని ఎద్దేవా చేశాడు. దీనితో అంబటి రాయుడు పై నెట్టింట్లో విమర్శలు వచ్చాయి. అయితే రాయుడు దానికి వివరణ ఇస్తున్నట్లుగా చేసిన తాజా ట్వీట్ వివాదం సద్దుమణిగేలా కాకుండా రెట్టింపు చేసేలా ఉంది. ‘‘ఎన్నో ఏళ్లుగా ఆర్‌సీబీని ఆదరిస్తున్న అభిమానులంటే నాకు అమితమైన ప్రేమ.. కానీ టీమ్ మేనేజ్‌మెంట్, లీడర్లు.. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా టీమ్ గురించి ఆలోచిస్తే ఆర్‌సీబీ ఎప్పుడో టైటిల్స్‌ను గెలుచుకునేది. ఎంతో మంది అద్భుతమైన ఆటగాళ్లు జట్టును వీడారో ఓ సారి గుర్తు చేసుకోండి. మెగా వేలం నుంచి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది” అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.