ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో ఎలిమినేటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు నాలుగింటిలో గెలిచి ఎనిమిది ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజ్‌లోనే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించడం పంజాబ్‌కు ఇది 15వసారి. ఒకే ఒక్కసారి ఫైనల్‌కు వెళ్లింది. మరోవైపు విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ( 47 బంతుల్లో 92 ) సెంచరీతో రాణించాడు. రజత్ పాటిదార్ ( 23 బంతుల్లో 55), కెమెరూన్ గ్రీన్ ( 27 బంతుల్లో 46) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు, అరంగేట్రం ఆటగాడు విద్వాత్ కవేరప్ప రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్ లో రొసో (27 బంతుల్లో 61) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్ , ఫెర్గూసన్ , కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.