ఐపీఎల్ 2024 సీజన్‌లో నిన్న ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సంచలన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. భువీ ఆఖరి బంతికి వికెట్ తీసి సన్‌రైజర్స్ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 58 పరుగులు చేసాడు. నితీష్ కుమార్ రెడ్డి 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రీచ్ క్లాసెన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 పరుగులు చేయగా , రియాన్ పరాగ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.