ఇదే నిజం నర్సంపేట /నల్లబెల్లి : గ్రామీణ మహిళల్లో పొదుపు అలవాట్లను పెంపొందించడంతో పాటు ఆర్థికా భివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి దోహదం చేసేందుకు ఏర్పాటైన గ్రామైక్య సంఘాలు గాడి తప్పుతున్నాయి. వీటిని సక్రమార్గంలో నడిపించాల్సిన నిర్వాహకులు అక్రమార్గంలో నడుపుతున్నారు. మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులే ఎక్కువగా ఉండడంతో వారి అమాయక త్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నారు. దీంతో కట్టాల్సిన డబ్బుల కంటే ఎక్కువగా కట్టి అమాయకులు మోసపోతున్నారు. మరోవైపు కొంద రికి కిస్తీలు పూర్తి చేసినా మరింత అప్పు ఉన్నారంటూ లెక్కల పుస్తకాల్లో చూపించడంతో కంగు తింటున్నారు. ఇదే విషయమై నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లె కు చెందిన పలువురు గ్రూపు సభ్యులు ఇటీవల కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
గొల్లపల్లి గ్రామంలో మహిళా సంఘ సభ్యుల డబ్బులను సిఏ సొంతంగా వాడుకుంటూ మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక వసుంధర మహిళా సంఘం సభ్యురాలు గాదం స్వప్న ఇటీవల కలెక్టర్ర్ డిఆర్డీఏకు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం స్పందించడం లేదని స్వప్న వాపోతుంది. నర్సంపేట యూనియన్ బ్యాంకు లోకి వెళ్లి వసుంధర గ్రూపు సభ్యులు ఎంత చెల్లించారని ఆరా తీయగా గత జూన్ నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా కట్టలేదని బ్యాంకు మేనేజర్ తేల్చి చెప్పడంతో స్వప్న ఈ విషయంపై కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. వసుంధర గ్రూపులో బ్యాంకు లింకేజీ రుణం తీసుకున్నప్పటికీ సభ్యులమంతా ప్రతినెల నిర్ణీత గడువు లోగా డబ్బులు చెల్లిస్తుండగా సిఏ గాదం మహిపాల్ సంఘం బుక్కుల్లో తప్పుడు రాతలు రాస్తూ తన సొంతానికి డబ్బులు వాడుకుంటూ బ్యాంకుకు చెల్లించడం లేదని స్వప్న తెలిపింది. నల్లబెల్లి ఏపిఎం కు కలెక్టర్ వెంటనే విచారణ చేయమని చెప్పినప్పటికీ గ్రామంలో కి రాకుండా దాటవేస్తున్నారని స్వప్న వాపోయింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి దోషిని కఠినంగా శిక్షించి మహిళలందరికీ తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.