తెలంగాణలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు. బతుకమ్మ కానుకగా 500 నగదు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ దానిపై కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. కనీసం కానుకలు ఇచ్చే అంశం కూడా తెరపైకి రాలేదు. దీంతో ఆడబిడ్డలు మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీకి మంగళం పాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండుగలా సాగేది. ఉచిత చీరలతో బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేవారు.