Homeజాతీయం#India : ప్రమాదంలో జర్నలిజం.. ? ఎందుకు.. ?

#India : ప్రమాదంలో జర్నలిజం.. ? ఎందుకు.. ?

“India is the largest democracy in the world. However, the government does not consider it necessary to comment on such fabrications, “said David Cook, chief of The Christian Science Monitor’s Washington bureau.

“భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అని 2014లో తాను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలోవ్యాఖ్యానించారు.

మోదీ పదవిని చేపట్టి ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. దేశంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ కొరవడి, ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని చాలామంది భావిస్తున్నారు .

180 దేశాలలో పరిస్థితులను పరిశీలించగా ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్’‌లో భారత్‌కు 142వ స్థానం దక్కింది.

ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా ఇంకా రెండు స్థానాలు తక్కువ.

‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే సంస్థ ప్రతియేటా భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి ఈ గణాంకాలను విడుదల చేస్తుంది.

ఆరోగ్యకరమైన మీడియా ఉందని చెప్పుకునే దేశానికి ఇది నిజంగా దారుణమైన ర్యాంకు అని చెప్పక తప్పదు.

భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన సందర్భంగా జరిగిన హింస తర్వాత మీడియా స్వేచ్ఛకు మరింత ప్రమాదం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

రైతుల ఆందోళనల్లో ఒక వ్యక్తి మరణించగా, 500మంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనలపై పలువురి మీద పోలీసులు దేశద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో 8మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు.

వీరంతా ఈ ఆందోళనలను కవర్‌ చేశారు.

నిరసనల సందర్భంగా ఒక రైతు ఎందుకు మరణించాడన్నది ఇంకా వివాదాస్పదంగానే ఉంది.

ట్రాక్టర్‌ తిరగబడటం వల్ల ఆ రైతు చనిపోయాడని అధికారులు చెబుతుండగా, పోలీసు కాల్పుల వల్లే మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఆరోపణలు వివిధ పత్రికల్లో, టీవీల్లో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ వార్తను కొందరు జర్నలిస్టులు రిపోర్ట్ చేయడమో పబ్లిష్ చేయడమో చేశారు.

అయితే కొందరు దీన్ని కేవలం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇలా సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్‌ చేసిన వారిలో ఆరుగురు జర్నలిస్టులతోపాటు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ కూడా ఉన్నారు.

వీరంతా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నది వీరిపై ఉన్న అభియోగం.

“ఒక మృతుడి కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం రిపోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయగా, దాని రిపోర్ట్‌ చేయడం నేరం అవుతుందా’’ అని ‘ది వైర్’ ఎడిటర్‌ ఇన్-చీఫ్‌ సిద్ధార్ధ వరదరాజన్ ప్రశ్నించారు.

‘ది వైర్’‌తోపాటు అందులో పనిచేసే ఒక జర్నలిస్టు పైనా కేసు నమోదైంది.

ఈ కేసులపై ఇండియావ్యాప్తంగా హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. “శాంతియుత ఆందోళనలు చేస్తున్నవారిని ప్రభుత్వం రెచ్చగొడుతోంది.

తనపై విమర్శలు చేసేవారిని, ఈ వార్తలను కవర్‌ చేసేవారిని కేసులతో అణచి వేయాలని చూస్తోంది” అని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్’ సౌత్ ఏషియా డైరక్టర్‌ మీనాక్షీ గంగూలీ అన్నారు.

పాత్రికేయులపై పెట్టిన కేసులు వారిని వేధించడానికి తప్ప మరొకటి కాదని ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ఆరోపించింది.

కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితాలో ‘కారవాన్‌’ న్యూస్‌ మేగజైన్‌ తరచూ కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని ఈ పత్రికకు పేరుంది.

నిరసనకారుల్లో ఒక వ్యక్తి మరణించాడన్న వార్త విషయంలో ఈ మేగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులపై ఐదు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి.

ఇదే మేగజైన్‌కు సంబంధించిన ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును పోలీసులు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో అరెస్టు చేసి, రెండు రోజుల తర్వాత విడుదల చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన లీగల్‌ నోటీసుతో ఈ మేగజైన్‌కు చెందిన ట్విటర్‌ ఎకౌంట్‌ను కొన్ని గంటలపాటు సస్పెన్షన్ లో పెట్టారు.

గత ఏడాది దిల్లీ నగరంలో ఒక యువతి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన నిరసన ప్రదర్శనల సమయంలో ‘కారవాన్‌’ మేగజైన్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులపై దాడులు జరిగాయి.

“ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించడం జర్నలిస్టుల విధి” అని ‘కారవాన్‌’ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వినోద్ జోస్‌ అన్నారు.

అధికార పార్టీ ఏమంటోంది?

పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్న వాదనను అధికార బీజేపీ తిరస్కరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో ఇది ఒక భాగమని స్పష్టం చేసింది.

“వివిధ పార్టీలతో సంబంధం ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులందరూ తమ తమ పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్‌లలో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా అన్నారు.

నిరసనకారులను కుట్రపూరితంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినట్లు తేలినందువల్లే జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని పాండా తెలిపారు.

తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ సీనియర్‌ ఎడిటర్‌ను కొన్నాళ్లు స్క్రీన్‌ మీద కనపడవద్దని యాజమాన్యం ఆదేశించిందని, అలాగే నెల రోజుల వేతనాన్ని కట్‌ చేసిందని పాండా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“ఇదేదో చిన్న తప్పిదం కాదు. ఒక భయంకరమైన విధ్వంసానికి కారణమయ్యే తప్పుడు ప్రచారం.

ఆ జర్నలిస్టు గతంలో కూడా ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించారు. బాధితులు కోర్టు వెళ్లడంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని పాండా అన్నారు.

“మోదీని వ్యతిరేకించే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై లేని ప్రేమను నటిస్తున్నాయి.

ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు’’ అని పాండా అన్నారు.

అయితే ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మైనారిటీలపై ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేసే జర్నలిస్టులు ఇలాంటి కేసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పించుకోగలుగుతున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వలస పాలకుల కాలంనాటి దేశద్రోహం చట్టాలను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మీద ప్రయోగించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత దశాబ్ధకాలంగా నమోదైన 405 దేశద్రోహం కేసుల్లో మెజారిటీ కేసులు 2014 తర్వాత, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైనవేనని ‘ఆర్టికల్ 14’ అనే వెబ్‌సైట్ రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది.

ప్రతిపక్ష నేతలు, విద్యార్ధులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు ఈ చట్టానికి బాధితులుగా మారారని వెల్లడించింది.

ప్రభుత్వం హక్కులను కాపాడలేదా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు గతంకన్నా ఎక్కువ విభజనకు గురయ్యారన్న భావన కనిపిస్తోంది. ప్రధాన మీడియాలో ఎక్కువ సంస్థలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.

“ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం తమ విధి కాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ‘ఫ్రీడమ్‌ హౌస్’‌ విడుదల చేసిన ఓ రిపోర్ట్‌ పేర్కొంది.

జర్నలిస్టులు స్వేచ్ఛగా లేరని, 2020 సంవత్సరంలో 67మంది జర్నలిస్టులు అరెస్టయ్యారని, 200మందిపై దాడులు జరిగాయని ‘ఫ్రీస్పీచ్‌ కలెక్టివ్’‌ కోసం నిర్వహించిన ఓ స్టడీలో గీతాశేషు అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతిపై అత్యాచారం వార్తను కవర్‌ చేసిన జర్నలిస్టు ఒకరు 5 నెలలపాటు జైలులో ఉండాల్సి వచ్చింది.

ప్రభుత్వాన్ని విమర్శించే మహిళా జర్నలిస్టులను ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన భాషలో ట్రోలింగ్‌ చేయడం, బెదిరించడం సర్వసాధరణమైంది.

“అత్యాచారం చేస్తామని, చంపుతామని నన్ను నేరుగా బెదిరించారు, ఆన్‌లైన్‌లో అభ్యంతరకర భాషలో ట్రోల్‌ చేశారు” అని దిల్లీకి చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు నేహా దీక్షిత్‌ వెల్లడించారు.

కొందరు తన అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని నేహా చెప్పారు.

రోహిణి సింగ్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును బెదిరించిన కేసులో పోలీసులు ఇటీవలే ఓ విద్యార్ధిని అరెస్టు చేశారు.

అప్రకటిత ఎమర్జెన్సీ

భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించే బలమైన చట్టాలు భారత్‌లో లేవని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వైస్‌డీన్‌ తరునాబ్‌ ఖేతాన్‌ అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం గ్యారంటీ ఇస్తున్నప్పటికీ 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన తొలి సవరణలోనే దానికి పరిమితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.

తొలి సవరణ నాటి నుంచి భారత ప్రభుత్వం “పౌరుల హక్కుల గురించి చెప్పడం వేరు, వాటిని రక్షించడం వేరు అన్న భావనలోకి వెళ్లింది ’’ అని ‘సిక్స్‌టీన్‌ స్టార్మీ డేస్‌’ అన్న పుస్తకంలో త్రిపుర్‌దమన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

“పౌర హక్కులను రక్షించడాన్ని ఒక బాధ్యతగాకన్నా ఒక అడ్డంకిగా ప్రభుత్వాలు చూస్తున్నాయి’’ అని ఖేతాన్‌ అన్నారు.

మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే ప్రజల హక్కులను రక్షించడంలో సుప్రీంకోర్టు ట్రాక్‌ రికార్డు కూడా దారుణంగా ఉందని ఖేతాన్‌ అభిప్రాయపడ్డారు.

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో 21 నెలలపాటు పత్రికా స్వేచ్ఛ అనేక నిర్బంధాలను ఎదుర్కొంది.

“ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఎమర్జెన్సీలాంటి నిర్బంధాలు లేకపోయినా, హక్కులను బహిరంగంగానే హరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇది ఎక్కడా అధికారికంగా అణచివేత కనిపించదు. కానీ అంతర్లీనంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరకంగా మనం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నాం’’ అని ఖేతాన్‌ వ్యాఖ్యానించారు.

“మరి కనిపించని ఈ ఎమర్జెన్సీని తొలగించడం ఎలా సాధ్యమవుతుంది’’ అని ఖేతాన్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img