Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వాన్ని విమర్శించే వారంతా రాజద్రోహులేనా ? డౌటు..

ప్రభుత్వాన్ని విమర్శించే వారంతా రాజద్రోహులేనా ? డౌటు..

పార్లమెంట్ సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవులకు, రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నదని తీవ్రమైన, అసభ్యమైన పదజాలంతో విమర్శించారు.

అది రాజద్రోహం 124 ఏ, మతవైషమ్యాలను రెచ్చగొట్టే నేరం 153 ఏ, హింసను ప్రేరేపించే మాటలు చెప్పే నేరం 505 బీ, అని ఆయన్నుఅరెస్టు చేశారు.

ఇప్పటికి మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసు ప్రయాణించింది.

కేవలం బెయిల్ రాకుండా జైల్లో చాలాకాలం ఉంచడం కోసమే, వాస్తవాలతో సంబంధం లేకుండా రాజద్రోహం కేసును విధిస్తున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో వాదించారు.

ఒక్క రాజు కేసులోనే కాదు, కేవలం ఏపీలోనే కాదు మొత్తం దేశంలోని 70 శాతం కేసుల్లో ఇది సంపూర్ణమైన వాస్తవం.

ఇది ముకుల్ వివరిస్తే తప్ప తెలియనంత రహస్యం కూడా కాదు. రఘురామకృష్ణరాజు కేసు ఒక తాజా ఉదాహరణ, అంతే.

అధికార పార్టీ ఎంపీ ముఖ్యమంత్రిని విమర్శించకూడదనే సూత్రం ఎక్కడ ఉంది?

ఆ విధంగా ముఖ్యమంత్రిని ఆయన తీవ్రంగా విమర్శించడం వెనుక ఏదో రాజకీయ మతలబు ఉండే ఉంటుంది.

కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగే పరిస్థితులు ఉంటే, విమర్శ పరువు నష్టం అయ్యే అవకాశం కూడా లేదు. హఠాత్తుగా ఇది రాజద్రోహంగా ఏవిధంగా మారుతుంది?

కనీసం ఎవరూ ఆరోపణ చేయలేదు. ఫిర్యాదు చేయలేదు. రఘురామకృష్ణరాజు మాటలు విని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎవరో ఆలోచన చేశారనో లేక హింసాయత్నం చేశారనో పుకారు కూడా లేదు.

ప్రాథమిక సాక్ష్యాలు అంటాం కదా, అవి కూడా ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు. దర్యాప్తు చేస్తున్నాం, దొరకగానే ముందుకు తెస్తాం అని పోలీసులు కోర్టులకు విన్నవిస్తాయి.

భీమా కోరేగావ్ కేసులో ఇంకా ఈ మాటే చెబుతున్నారు. కోర్టులు బెయిల్ కూడా ఇవ్వకుండా ఆడా, మగా, పెద్దా, చిన్నా తేడా లేకుండా, కరోనాను కూడా పట్టించుకోకుండా జైల్లోనే పడి ఉండనీ అనే ధోరణిలో పాలకులున్నారు.

రాజు కేసులో కూడా ఇంతవరకు ఏ ప్రాథమిక ఆధారాలూ చూపలేదు.

ఈ సెక్షన్ పాలకుల చేతిలో భస్మాసుర హస్తం లాంటిది. వారు ఎవరి నెత్తినైనా పెట్టవచ్చు. వాళ్ల హక్కులు భస్మీపటలం అయిపోతాయి.

వారంట్ లేకుండా అరెస్టు చేసే సౌకర్యం ఉంటుంది. వెంటనే బెయిల్ ఇవ్వాల్సిన పనిలేదు. వారి మీద కేసు ఉండదుగానీ బయటకు రాలేరు. ‘ఎంత మజా’ అని పాలకులు అనుకునే మరో మానసిక ఆనందం.

చివరకు కేసు ఏమయిపోయినా పరవాలేదు, ముందు జైల్లో కొన్నేళ్లు మగ్గిపోనీ, ఈ లోగా మన పదవీకాలం ముగుస్తుంది, మళ్లీ ఎన్నికవుతాం అనే ధోరణి. ఎన్ని కోట్లు ఖర్చయినా ఫరవాలేదు, అతనికి బెయిల్ రాకుండా చూడండి అని రాజులు ఆజ్ఞాపిస్తారు. లా డిపార్ట్ మెంటయినా, లాయర్లయినా శిరసావహించక తప్పదు.

అధికార పార్టీ ఎంపీకే ఈ గతి పడితే, మామూలు విమర్శకులకు, ఫేస్‌బుక్‌లో ఆక్రోశం వ్యక్తం చేసే వారికి, కరోనా నిరోధక సామగ్రి లేక ఆందోళన చెంది ఆవేశపడిన డాక్టర్‌కు, వాట్సప్‌లో ఫార్వర్డు చేసిన వారికి ఏ గతి పడుతుందో.

పోలీసుల స్వతంత్ర కార్య నిర్వహణ

పోలీసులు సొంతంగా ఈ కేసును స్వీకరించి, స్వతంత్రంగా విచారణ జరిపి, రాజద్రోహం అవుతుందని నిర్ణయించారు. నిజమా?

ఇంత స్వతంత్రంగా అధికార పార్టీ ఎంపీ పైన కేసు పెట్టే స్వతంత్రత పోలీసు అధికారికి ఎవరికైనా ఈ కాలంలో ఉందా?

ఏదో కేసు పెట్టి మూసేయండి అనే ఆదేశం రాకుండానే ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారా?

కస్టడీలో ఉన్న ఎంపీ పైన థర్డ్ డిగ్రీ హింసలు జరుపుతారనే ఆరోపణలు ఫోటోలతో బయటకు వచ్చాయి.

పైకి కనిపించకుండా వైద్య పరీక్షలకు దొరకకుండా, ఒళ్లు హూనం అయ్యేట్టు కొట్టగల అసమాన ప్రతిభావంతులు పోలీసులని, ఆ గుప్తమయిన దెబ్బలనే పోలీసు దెబ్బలంటారని కీర్తి ఉంది.

ఎంపీ విషయంలో ఆ విధంగా చేయకపోవచ్చనే వాదం కూడా ఉంది.

పోలీసులు స్వతంత్రులైనట్టే పక్షపాతం అనే జబ్బులేని వైద్యులు కూడా దేశానికి అవసరం.

వైద్యపరీక్ష ఎవరు చేయాలి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యులు నిష్పాక్షిక పరీక్షలు జరిపి న్యాయమైన నివేదిక ఇస్తారని నమ్మడానికి వీల్లేదని హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదించారు.

సూత్రప్రాయంగా ఈ అంశాన్ని అంగీకరించి ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో, అదీ మిలిటరీ వైద్యశాలలో, తెలంగాణ హైకోర్టు నియమించే న్యాయాధికారి సమక్షంలో జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగపు విశ్వసనీయత.

ఏపీ పోలీసులు, వైద్యులు అసలు ఈ వాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదనుకుంటారేమో తెలియదు. లేదా చర్మం మందం చేసుకునే మందులేవయినా ఉన్నాయోమో చూడాలి.

మన స్వతంత్రం

మనదేశంలో పత్రికా స్వాతంత్ర్యపు సూచిక మరికొన్ని పాయింట్లు పడి పోయి 138కి చేరుకుందని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ తేల్చి చెప్పారు.

ఇది పత్రికా స్వాతంత్ర్యం సంగతి మాత్రమే. వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం గురించి వీరు లెక్కించరు. అది ఇంకా అథః పాతాళంలో ఉండి ఉంటుంది.

ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం జాతి వ్యతిరేక చర్య అని నిర్వచిస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం రాజద్రోహం అంటున్నారు.

దేశంలో ప్రధానిని విమర్శించినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని విమర్శించినా ఏకంగా రాజద్రోహమే.

మొత్తం జీవిత కాలమంతా కారాగారంలో ఉండాలనే శిక్ష విధించే అవకాశం ఉన్న ఈ నేరాన్ని నెత్తిన మోపుతారు.

‌ఆంధ్రప్రదేశ్‌లో విమర్శ మీద రాజకీయ ప్రభుత్వం విరుచుకుపడితే దానికి పోలీసు యంత్రాంగం సాయం చేయడం, కేంద్రానికైతే సీబీఐ, ఈడీ, ఎన్‌ఐ‌ఏ కూడా సహకరించడం మామూలైపోయింది.

నోరుమూసుకోవడం ప్రజల బాధ్యతా?

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రేమతో ఇచ్చే కానుకలు తీసుకోవాలి, ఇచ్చే పింఛన్లు, సబ్సిడీలు, ఉచిత రుబ్బురోళ్లు తీసుకోవాలి. వారికే ఓటు వేయాలి.

అడుక్కోవడానికి తప్ప దేనికీ నోరు తెరవకూడదు. చేసిన చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకమైనా నోరు తెరిచి విమర్శించకూడదు. ఆందోళనలు, బంద్‌లు చేయకూడదు.

అధికార పార్టీవారు ఏ విధంగా సానుకూలంగా ప్రశంసిస్తూ ఉంటారో అదే విధంగా ప్రశంసించాలేగానీ, ‘‘కాదు, కూడదు’’ అనకూడదు. అంటే పోలీసులు అరెస్టు చేస్తారు.

మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాడినా సరే బెయిల్ ఇవ్వడం పెద్దల దయమీద ఆధారపడి ఉంటుంది.

కేంద్రం, అనేకానేక రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. తమ ప్రజలనే రాజద్రోహులుగా చూసే రాజకీయం చెలరేగుతున్నది.

ప్రజలకు సాయం చేసినప్పుడు సంక్షేమ రాజ్యం అని పొగడాలి, పోలీసులు అరెస్టు చేస్తే, నేతలు చెప్పిన రకరకాల కేసుల్లో ఇరికిస్తే ఇరుక్కుపోవాలిగానీ పోలీసు రాజ్యం అనకూడదు. అది కూడా రాజద్రోహమే.

అన్నిటికన్నాముఖ్యంగా రాజద్రోహం నేర నిర్వచనాన్ని ఎడాపెడా వాడేయడం, యుఏపిఏ, జాతీయ భద్రత చట్టం, వంటి అనేకానేక ప్రత్యక చట్టాలను సామాన్యుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు.

డబ్బు తీసుకుని అధికార పార్టీలోకి ఫిరాయించాలి. లేకపోతే బెయిల్ దొరకని కేసులు పెట్టి బొక్కలో తోస్తారు.

ఆర్టికల్ 19(1)(ఏ) కింద మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. కాని పబ్లిక్ ఆర్డర్ కింద మాట్లాడే స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించవచ్చు.

ఆ చిన్న సూది బెజ్జంలోంచి ఏనుగులు నడుపుతారు. బెయిల్ ఇవ్వడానికి వీల్లేని కేసులు పెడుతున్నారు.

ఉరి వేసే నేరాల తరువాత తీవ్రమైన నేరాల జాబితలో రాజద్రోహం మొదటిది.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో 3762 మంది మీద రాజద్రోహ నేరం మోపితే, నరేంద్రమోదీగారి పదవీ కాలంలో ఇంతవరకు 7136ని ఈ నేరారోపణతో లోపల తోసేసారని ఆర్టికిల్ 14 పరిశోదనా సంస్థ అధ్యయనం చేసి వివరించింది.

2014 తరువాత పెట్టిన రాజద్రోహం కేసులలో 96 శాతం అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చారు.

ప్రధానమంత్రిని విమర్శించారనే నెపంతో 149 మంది పైన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు 144 మంది పైన రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో తోసేసారు.

రైతుల ఆందోళనలో పాల్గొన్నందుకు ఆరుగురిని, హథ్‌రస్ గ్యాంగ్ రేప్‌ను రిపోర్ట్ చేసినందుకు తదితర కారణాలపైన 22 మంది పైన, పౌరసత్వచట్టం సవరణను వ్యతిరేకించినందుకు 25 మంది పైన, పుల్వామా టెర్రర్ దాడి తరువాత 27 మంది పైన రాజద్రోహం కేసులు పెట్టారు.

పొలిటీషియన్లు, పోలీసులు కలిసి రాజద్రోహం కేసులను ఏటేటా 28 శాతం పెంచుతూనే ఉన్నారు.

నిన్నమొన్న.. మే 15న ప్రధాని వాక్సిన్‌లను ఎగుమతి చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లను అంటించినందుకు 25 మంది మీద రకరకాల క్రిమినల్ కేసులు పెట్టారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టడమే కాక విమర్శించిన వారి ఫోటోలు, ఫోన్ నెంబర్లు గోడలమీద రాసే అవమానకరమైన యూపీ విధానాన్ని సుప్రీంకోర్టు నిరుడు విమర్శించింది.జాతీయ భద్రత కేసులను కొట్టివేసింది.

జనవరి 26న యాక్సిడెంట్ అని పోలీసులకు కూడా తెలియకముందు పోలీసు కాల్పుల్లో ఒక రైతు మరణించాడని ట్వీట్ చేసినందుకు జర్నలిస్టుల పైన, ఎంపీ శశిథరూర్ పైన రాజద్రోహం కేసులు పెట్టారు.

ఇదే ధోరణి కొనసాగితే సగంమంది జర్నలిస్టులను పెట్టడం కోసం కొత్తగా జైళ్లు కట్టాల్సివస్తుంది.

నినాదాలు రాజద్రోహమేనట

గత దశాబ్దంలో కేవలం నినాదాలు చేసినందుకు 1310 మంది పైన రాజద్రోహం ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని ఇండియా టుడే ఇటీవలే ఒక పరిశోధనాత్మక నివేదికలో రాసింది.

ఇందిరా గాంధీ హత్యకు గురైన తరువాత, కొందరు నిందితులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ బల్వంత్ సింగ్‌ను, పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులో సీనియర్ క్లర్క్‌గా పనిచేసే భూపేంద్ర సింగ్‌ను రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూట్ చేసారు.

బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ((1995) 3 SCC 214) సుప్రీం కోర్టు దాకా వచ్చింది. 124 ఏ కింద రాజద్రోహమే కాదు, 153 ఏ కింద మత విద్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణ కూడా నిలబడదని సుప్రీంకోర్టు వివరించింది.

హింసాకాండను రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉండడం, చెప్పిన మాటల్లో రెచ్చగొట్టే లక్షణం ఉండడం, అందువల్ల రెచ్చిపోవడం జరిగితే తప్ప రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు 1995 మార్చి 1 నాడు మరొక సారి తీర్పు చెప్పింది.

తీర్పును ఉల్లంఘించడమా?

సుప్రీంకోర్టు తీర్పు దేశం మొత్తానికి చట్టంగా పనిచేస్తుందని రాజ్యంగం వివరిస్తున్నది. ఐపీసీలో ఉన్న నేర నిర్వచనంతో పాటు దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ కూడా శాసనమే అవుతుంది.

ఈ శాసనాన్ని ఉల్లంఘించే అధికారం పోలీసులకు ఎక్కడినుంచి వస్తుంది? ఉల్లంఘిస్తే వారి మీద చర్యలు తీసుకునే బదులు ఆ కేసు మళ్లీ సుప్రీంకోర్టు దాకా కొనిపోవడమేమిటి?

2014 సంవత్సరం నుంచి 2016 వరకు 179 మందిని అరెస్టు చేసినట్టు జాతీయ నేరాల రికార్డు బ్యూరో అంకెలు వివరిస్తున్నాయి. 70 శాతం కేసుల్లో కనీసం చార్జిషీటు కూడా వేయలేదు.

2019లో నేర నిరూపణ అయిన కేసులు మూడు శాతం మాత్రమే. తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షించరా? అన్యాయంగా బందీలయిన పౌరులకు పరిహారం ఇవ్వారా? ఆ ఆలోచనే లేదు.

యూఏపీఏ కేసులు కూడా…

యూఏపీఏ కేసులు కూడా విమర్శను అణచివేయడానికి వాడుతున్నారు. కేంద్రంతో పాటు మణిపూర్, జమ్మూ కాశ్మీర్, అసోం, జార్ఖండ్, యూపీ, కేరళ రాష్ట్రాలలో ఈ చట్టాన్ని విరివిగా దుర్వినియోగం చేస్తున్నారు.

2016 నుంచి 2019 వరకు మొత్తం 5922 మంది మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తే కేవలం 2.2 శాతం మంది అంటే 132 మీద మాత్రం కేసులు రుజువైనాయి.

ఛత్తీస్‌ఘఢ్‌లో ముఖ్యమంత్రికి ఇన్వర్టర్ కంపినీలకు మధ్య ఏదో డీలింగ్ ఉండడం వల్లనే విద్యుచ్ఛక్తి సరఫరాలో లోపాలు ఉన్నాయని ఒక 53 సంవత్సరాల వ్యక్తి ఫేస్‌బుక్‌లో రాసినందుకు రాజద్రోహం కేసు పెట్టారు.

పత్రికలు, జనం విమర్శిస్తే ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నతరువాత ఈ ఆరోపణను తొలగించారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌ఏ నిరసనలలో భాగంగా మేం పత్రాలు చూపం అంటూ కొద్ది నిమిషాల చిన్న డ్రామా స్కూల్లో ప్రదర్శించినందుకు, పౌరసత్వ రుజువు చేసుకోవాలన్నందుకు ప్రధానోపాధ్యాయురాలికి పౌరసత్వం రుజువు చేసుకునే పత్రాలు ఎవరు అడిగినా చెప్పుతో కొట్టాలన్నట్టు చెప్పు చూపించారని, కానీ ప్రధానిని చెప్పుతో కొట్టాలని పిల్లలు అన్నట్టు తప్పుడు ప్రచారం చేశారని స్కూల్ యాజమాన్యం వివరించింది.

అయినా ఆ డైలాగ్ చెప్పిన విద్యార్థిని, తల్లిమీద రాజద్రోహ కేసు పెట్టారు.

పర్యావరణం కోసం కృషి చేస్తున్న యువతి దిశా రవి ప్రభుత్వ రైతుల చట్టాలను వ్యతిరేకించే ఒక టూల్ కిట్‌లో రెండు లైన్లు ఎడిట్ చేసారు. అదే దేశద్రోహమని తప్పుడు కేసు పెట్టారు.

ఇది 2021 దుర్వినియోగం డిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ ఈ కేసును కొట్టివేసింది.

తాజా కేసు మరీ ఆశ్చర్యపరుస్తుంది. మే 15న మణిపూర్ లో ‘‘బీజేపీ ప్రెసిడెంట్ కరోనాతో చనిపోతే ఫేస్‌బుక్‌లో గోమూత్రం, గోవు పేడ రక్షించవు సార్. విజ్ఞానం, ఇంగిత జ్ఞానంలోనే చికిత్స ఉంది’’ అని రాసినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టారు.

ప్రభుత్వాన్నివిమర్శిస్తే జాతిని వ్యతిరేకించినట్టు, దేశాన్ని ద్వేషించినట్టు చిత్రీకరించే ధోరణి కొత్తగా మొదలైందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ అన్యాయ విధానాలను వ్యతిరేకిస్తే జైలు పాలవుతారనే చలిజ్వరం వంటి భయాన్ని కలిగించే భయంకర వాతావరణాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి.

మరోవైపు సాంఘిక మాధ్యమాలలో అధికార పార్టీ మద్దతుదారులు వివిధ సైన్యాలు, బృందాల పేరుతో ప్రభుత్వ విమర్శకులను అసభ్యపదజాలంతో తిడుతూ అవమానిస్తూ వేలాది పోస్టులు పెడుతూ ట్రాలింగ్ చేస్తున్నారు.

మాస్కుపెట్టుకోకపోయినా, సాంఘిక దూరం పాటించకపోయినా జనం దారుణంగా చచ్చిపోతారని భయోత్పాతం కలిగించిన రీతిలోనే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు జైలే గతి అనే చలిజ్వరం కలిగించడమే అధికార పార్టీ కార్యకర్తలు, అదే ధోరణిలో పనిచేసే పోలీసుల వ్యూహంగా మారినట్టు కనిపిస్తున్నది.

ఇది రెండున్నరేళ్ల ఎమర్జన్సీని మరిపించే భయానక పాలన అనే అపకీర్తిని పాలకులు మూట గట్టుకుంటున్నారేమో అనిపిస్తున్నది.

ఇప్పటికైనా ప్రశ్నల గొంతు నొక్కడానికి ఈ భయానక అభియోగాలను వాడుతూ తప్పుడు ప్రయోగాలు చేయడం మానేయాలి.

Recent

- Advertisment -spot_img