Homeతెలంగాణకాంగ్రెస్​ సర్కారు రాష్ట్రంలో చిచ్చు రాజేయబోతున్నదా..?

కాంగ్రెస్​ సర్కారు రాష్ట్రంలో చిచ్చు రాజేయబోతున్నదా..?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ సర్కారు రాష్ట్రంలో చిచ్చు రాజేయబోతున్నదా? రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చాలని చూస్తోందా? అన్న డౌట్స్​ వస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త చిచ్చుకు తెరతీస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించింది. దీంతో కొత్త కలెక్టరేట్లు, కొత్త మెడికల్​ కళాశాలలు, కొత్త ఎస్పీ కార్యాలయాలు వచ్చాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్​ ఎస్టేట్ భారీగా పెరిగింది. పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది. పాలన ప్రజలకు దగ్గరైంది. కలెక్టర్లు, కీలక అధికారులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. సమస్య జరిగిన వెంబడే పరిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాల ఏర్పాటును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి.. తాజాగా ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 17 జిల్లాలుగా మార్చబోతున్నారని లీక్​ లు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని అంతా చర్చించుకుంటున్నారు. అసలు రేవంత్​ సర్కారు ఆ ఆలోచన ఎందుకు చేస్తోంది? తేనెతుట్టెను ఎందుకు కదపబోతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు.

సిల్లీ రీజన్స్​తో జిల్లాలను కుదించేస్తారా?
ప్రస్తుతం కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నాయి. కాబట్టి సదరు ఎంపీ తన నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే నలుగురు కలెక్టర్లు, నలుగురు ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తోంది ఈ కారణాన్ని కాంగ్రెస్ నేతలు తెరమీదకు తీసుకొస్తున్నారు. నిజానికి నలుగురు కలెక్టర్లతో ఎంపీ మాట్లాడితే తప్పేంటన్న చర్చ జరుగుతోంది. జిల్లాలు పెరిగినప్పుడు కలెక్టర్లు పెరుగుతారు.. తద్వారా ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించే చాన్స్​ ఉంటుంది. సదరు ఎంపీ ఉద్దేశ్యం సమస్యల పరిష్కారమే అయినప్పుడే నలుగురు కలెక్టర్లతో మాట్లాడితే తప్పేంటి? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని మండలాల ప్రజలను వారి ఇష్టానికి భిన్నంగా కొత్త జిల్లాల్లో కలిపేశారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఈ మేరకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. తమ మండలాన్ని ఫలానా జిల్లాలో కలపాలని కోరే వారున్నారు. కానీ మొత్తానికే జిల్లాలను కుదిస్తే వారు ఊరుకొనే పరిస్థితి లేదు.

భారీ ఉద్యమాలు
గతంలో జిల్లాల ఏర్పాటు సందర్భంగా జనగామ, ములుగు, గద్వాల, నారాయణపేట వంటి జిల్లాల కోసం భారీగా ఉద్యమాలు జరిగాయి. పార్టీలకతీతంగా అందరూ జేఏసీగా ఏర్పటి తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తుకు తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్​ ములుగు, నారాయణపేట వంటి జిల్లాలను ఆ తర్వాత కూడా ఏర్పాటు చేశారు. నిజానికి అప్పటి సీఎం కేసీఆర్​ పార్టీలకతీతంగా జిల్లాల ఏర్పాటు చేశారు. ములుగు, గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు లేరు.. అయినా ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇక అత్యధిక జనాభా ఉండే హైదరాబాద్ ను ఒక్క జిల్లాగా ఏర్పాటు చేసి.. చాలా తక్కువ జనాభా ఉన్న ములుగు వంటి నియోజవకర్గాన్ని ఎందుకు జిల్లా చేశారు? అన్న ప్రశ్నలు వచ్చాయి. ఒకవేళ అదే నిజమైతే హైదరాబాద్ ను మరో జిల్లాగా ఏర్పాటు చేయలని డిమాండ్ చేయాలి కానీ.. మొత్తం జిల్లాలను కుదించాలని చెప్పడం ఎంతవరకు న్యాయం? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

జనం ఊరుకుంటారా?
జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలు ఎంతో లాభం పొందారు. రియల్​ ఎస్టేట్​ అభివృద్ధి చెందింది. కలెక్టరేట్లకు వెళ్లడం సులువయ్యింది. కలెక్టర్​ కార్యాలయం చాలా దగ్గరగా ఉండటంతో ఇతర కార్యాలయాల అధికారులు కూడా అలెర్ట్​ గా ఉంటున్నారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఏ క్షణంలోనైనా తనిఖీలు జరగొచ్చని ఉపాధ్యాయులు అలెర్ట్​ గా ఉంటున్నారు. దీంతో పాటూ ఎంతో మంది అధికారులకు ప్రమోషన్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగినా, కుదింపు జరిగినా రాష్ట్రం మొత్తం అలజడి రేగే చాన్స్​ ఉంది. తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. అనివార్యంగా రాజకీయపార్టీలు సైతం ఈ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తాయి. వెరసి రేవంత్ సర్కారుకు ఇబ్బంది తప్పదు. మరి రేవంత్ రెడ్డి నిజంగానే ఈ దుస్సాహనానికి తెగబడతారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img