ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి(26/11) జరిగి 15 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మారణహోమానికి కారణమైన ‘లష్కరే తోయిబా ’ను ఉగ్ర సంస్థగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లష్కరే తోయిబాను ఉగ్ర సంస్థలజాబితాలో చేర్చుతున్నాం. దీని కోసం భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన రాకపోయినప్పటికీ.. ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అవసరమైన అధికారిక ప్రక్రియను మేం పూర్తిచేశాం. లష్కరే తోయిబా ఓ భయానక ఉగ్ర సంస్థ. భారత పౌరులతో పాటు వందలాది మందిని ఈ సంస్థ పొట్టనబెట్టుకుంది. 2008 నవంబరు 26న ఈ ఉగ్ర సంస్థ చేపట్టిన క్రూరమైన దాడి తాలుకూ భయాలు ఇంకా మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి’అని ఇజ్రాయెల్ ఎంబసీ తమ ప్రకటనలో పేర్కొంది.