– పిలుపునిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
– గాజాలోని అల్–షిఫా ఆస్పత్రి వద్ద హృదయవిదారక పరిస్థితులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్ నెట్‌వర్క్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర అండర్ గ్రౌండ్ దాడులతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్పత్రి కింద హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని అనుమానిస్తున్న ఇజ్రాయెల్ దళాలు దాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఈ హాస్పిటల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వైద్యపరికరాలు, మందుల సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడటంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ప్రపంచం మౌనంగా ఉండబోదని.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని అత్యవసర పిలుపునిచ్చింది.‘గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి ఆరోగ్య నిపుణులను సంప్రదించగలిగాం. అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా, భయంకరంగా ఉన్నాయి. మూడ్రోజులుగా విద్యుత్, నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల ఆ ఆస్పత్రికి మేం అత్యవసర సాయం అందించలేకపోతున్నాం.
ఈ ప్రాంతంలో నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, బాంబు దాడులు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితులను మరింత తీవ్రం చేశాయి. రోగుల మరణాలు గణనీయంగా పెరుగుతుండటం విచారకరం. ప్రస్తుతం ఆ ఆస్పత్రి.. ఎలాంటి వైద్య సేవలు అందించలేకపోతోంది. ప్రజలకు సురక్షిత ప్రాంతాలుగా ఉండాల్సిన ఆస్పత్రుల్లో.. మరణాలు, నిరాశ, నిస్పృహలతో కూడిన దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇక, ఈ ప్రపంచం మౌనంగా ఉండదు. కాల్పుల విరమణ.. తక్షణమే జరగాలి’అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ సొరంగాలను లక్ష్యంగా చేసుకుని ఉత్తర గాజాలో చాలా దూరం చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ప్రాంతంలోని 36 ఆస్పత్రుల్లో 20 హాస్పిటళ్లు ఇప్పుడు పనిచేయడం లేదు. మరోవైపు, నిరంతరంగా సాగుతున్న బాంబు దాడులతో ఉత్తర గాజాలో చాలా మంది అల్-షిఫా ఆసుపత్రి వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఐడీఎఫ్ చుట్టుముట్టడంతో అనేక మంది సామాన్య పౌరులు అందులో చిక్కుకుపోయారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఆస్పత్రిని హమాస్ తమ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.