Homeక్రైంఇజ్రాయెల్ ​–పాలస్తీనా రణరంగం

ఇజ్రాయెల్ ​–పాలస్తీనా రణరంగం

– కొనసాగుతున్న హమాస్ దాడులు
– ఇజ్రాయెల్​లో 300 దాటిన మృతుల సంఖ్య
– గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం.. 300 మంది మృతి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌, ఇజ్రాయెల్‌కు మధ్య జరుగుతున్న భీకర పోరులో మృతుల సంఖ్య పెరిగిన్నట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. తాజాగా ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 300 దాటింది. 1,500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హమాస్‌ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించారు. దీంతో ఇరువైపులా మరణాల సంఖ్య 600 దాటింది. ఇదిలా ఉండగా.. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హమాస్‌ మిలిటెంట్లు కొందరు పౌరులు, ఐడీఎఫ్‌ సైనికులను బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకువెళ్లిన్నట్లు తెలుస్తోంది.
హమాస్​కు మద్దతుగా హెజ్బోల్లా
తాజాగా గాజాలోని హమాస్‌ మిలిటెంట్లకు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా చేరింది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, మోర్టార్లతో దాడులు మొదలుపెట్టింది.
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద ఉన్నాయి.
ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్లు ప్రకటన చేసింది. ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్‌ ఫామ్‌, షీబా ఫామ్స్‌ వద్ద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది.
తిప్పికొట్టిన ఇజ్రాయెల్ సైన్యం
మరోవైపు హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొట్టాయి. కాకపోతే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. తమపైకి మోర్టార్‌ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించంది. గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ 1981లో స్వాధీనం చేసుకుంది.
దేశ పౌరులను కాపాడుకుంటాం: ఇజ్రాయెల్
తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపడతామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్‌ ప్రతినిధి గలీద్‌ ఎర్డాన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గాజా పట్టీ నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తెలిపారు.
(బాక్స్)
మాకు ఇరాన్‌ మద్దతు ఉంది: హమాస్
ఇజ్రాయెల్​పై తాము చేసిన మెరుపు దాడికి ఇరాన్‌ మద్దతు ఉందని మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఘాజీ హమీద్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ కూడా ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉండే అవకాశం ఉందని బలంగా నమ్ముతూ వస్తోంది. తాజాగా హమీద్‌ ప్రకటనతో అది నిజమని తేలింది. మరోవైపు ఇరాన్‌ కూడా హమాస్‌ దాడిని ఆత్మరక్షణగా అభివర్ణించింది. ఈ మేరకు నిన్న రాత్రి ఇరాన్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణచివేతకు గురైనా పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా దీనిని పేర్కొంది. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. వెస్ట్‌బ్యాంక్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు బ్లింకన్‌ వెల్లడించారు. ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాలస్తీనా అథారిటీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

Recent

- Advertisment -spot_img