– ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: యుద్ధం రెండో దశలోకి చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. భూతల పోరాటం విస్తరణతో హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి గాల్లాంట్ ఆయన వెంట ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ వార్ కేబినెట్, సెక్యూరిటీ కెబినెట్‌ల ఏకాభిప్రాయంతో చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. బందీలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యానికి భిన్నంగా భూతల దాడులు ఉండవని చెప్పారు. ‘మా కమాండర్లు, సైనికులు శత్రు భూభాగంలో ఉండి పోరాడుతున్నారు. వారికి దేశం, దేశ నాయకత్వం అండగా ఉన్నాయి. మన ఉనికిని కాపాడుకొనేందుకు, ఈ ప్రపంచం నుంచి చెడును తొలగించేందుకు వారు పోరాడుతున్నారు. మానవ జాతి కోసం అని కూడా నేను అంటాను. పౌరులను బందీలుగా చేసుకోవడం మానవ జాతిపట్ల నేరం. మా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారనడాన్ని ఆత్మవంచనగా చెబుతాను’అని ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇటీవల హమాస్ నాయకులు పిలుపునిచ్చిన ‘ఆల్ ఫర్ ఆల్’ డీల్‌పై కూడా ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. ఈ డీల్ ప్రకారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలంటే.. పాలస్తీనా బందీలను కూడా విడుదల చేయాలి. దీనిపై నెతన్యాహు మాట్లాడుతూ ‘‘ఈ విషయంపై మేం చర్చిస్తున్నాం’’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. కేబినెట్‌లో చర్చించే ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను ఇక్కడ చెప్పడం భావ్యంకాదన్నారు. అంతేకాదు.. ఇది ఏ రకంగా ప్రయోజనకరం కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాల్లాంట్ మాట్లాడుతూ తమ ఆపరేషన్ దెబ్బకు గాజాలో భూమి కంపిస్తోందన్నారు. బందీలను వెనక్కి తీసుకురావడానికి ఇజ్రాయెల్ తన ప్రయత్నాలు మొత్తం చేస్తుందన్నారు. అది తమకు తక్కువ ప్రాధాన్యమున్న అంశం కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల తీవ్రతకు హమాస్ దిగొచ్చి.. బందీలను విడుదల చేస్తుందన్నారు. శుక్రవారం రాత్రి భూతల దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ ట్యాంకులు, కాంబాట్ ఇంజినీరింగ్ ఫోర్స్, ట్యాంకులు గాజాలోకి ప్రవేశించాయి. శనివారం కూడా అక్కడే ఉన్నాయి. హమాస్ కార్యకలాపాలు జరిపే ప్రాంతాల్లో ఇవి దాడులు చేపట్టాయి.