ఇదే నిజం, తెలంగాణ: పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌షోల్ పాల్గొన్న ఆయన..కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్‌ను పరిచయం చేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి కరవు పరిస్థితులను చూసి వరద కాల్వ పునరుజ్జీవ పథకంతో నీళ్లతో నింపితే.. ఇప్పుడు ఆ కాల్వను ఎందుకు ఎండబెడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.
‘జగిత్యాల జిల్లా చేసుకుంటే.. రేవంత్‌రెడ్డి తీసేస్తా అంటున్నాడు. జిల్లా కావాలా? వద్దా? రైతు బంధు వచ్చిందా.. డబ్బులు ఖాతాల్లో పడ్డాయా? కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. మభ్యపెట్టి మోసాలతో ఓట్లు దండుకున్నారు. రైతు బంధుకు 5 ఎకరాలకు సీలింగ్ పెడతారట..25 ఎకరాలకు పెట్టాలి. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదు అంటున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు.. ఒక్క పైసా అయినా తెచ్చారా? ఇక్కడ గెలిచిన అర్వింద్ పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదు. మోడీ.. గోదావరి జలాలు తీసుకుపోతా అంటున్నారు. మన జలాల గురించి బీజేపీ వాళ్లు కొట్లాడుతారా? తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడేది బీఆర్‌ఎస్ మాత్రమే. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో యువత ఆలోచించి ఓటు వేయాలి’ అని కేసీఆర్ కోరారు.
బీడీ కార్మికులను ఆదుకున్నాం..
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో అనేక మంది బీడీ కార్మికులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వారికి ఏనాడైనా రూపాయి పెన్షన్ ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. బీడీ కార్మికులను ఆదుకుని, వారి బతుకులను నిలబెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెలవేర్చలేకపోయిందన్నారు. ‘మహిళలకు రూ.2,500 వచ్చాయా? జగిత్యాలలో వచ్చాయంట కదా? నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చెబుతున్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా?’అని కేసీఆర్ జనాలను అడిగారు.
బీజేపీ ఎంపీలు ఏం చేశారు?
కేంద్రంలో మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. మోడీ వల్ల ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ హయాంలో న్యాయం జరగలేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే చేతులు కట్టుకుని నిలబడతారు తప్ప మోడీ ముందు మాట్లాడతారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అదే బీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేలా కొట్లాడతారని స్పష్టం చేశారు. ‘జగిత్యాలలో చాలామంది రచయితలు, మేధావులు, రమణయ్య లాంటి పెద్దలు ఉన్నారు. మీ అందరికి దండం పెట్టి ఒక్కటే చెబుతున్నా. తెలంగాణను తెచ్చి ఎంత బాగు చేశానో మీ కళ్లారా చూశారు. ఇవాళ నా కళ్ల ముందే రాష్ట్రం ఆగమవుతుంటే పిడికిలి బిగించి మళ్లీ పోరాటానికి వచ్చా. మన నిధులు మనం తెచ్చుకోవాలని జగిత్యాలలో ఉండే రచయితలు, మేధావులు, విద్యావంతులను కోరుతున్నా’ అని కేసీఆర్ విన్నవించారు. ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని ఆయన సూచించారు.
ఉద్యమం అయిపోలేదు..
ఇదే నిజం, వీణవంక: తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేశాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్లి పోయింది. అల్యూమినియం, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తోంది. నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతోంది. 2001లో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముంది. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది’ అని కేసీఆర్ విమర్శించారు.
దాబాలో కేసీఆర్… సెల్ఫీలు దిగిన యువత
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోటెత్తుతున్నారు. బస్సు యాత్ర వెనుక కదలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వీణవంకలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన జగిత్యాల జిల్లాకు బయల్దేరారు. దారి మధ్యలో కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఆగి అక్కడ సమోసా తిని చాయ్ తాగారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతను చూసిన జనం సంబురాల్లో మునిగిపోయారు. కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తి చూపించారు. వాళ్లతో ఫొటోలు దిగిన అనంతరం కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు.