‘టైగర్3’తో తాజాగా సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ మూవీ సక్సెస్ మీట్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంగ్లిష్ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 25 ఏళ్ల నుంచి ఇంటిబయట డిన్నర్లకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ‘కొన్ని సంవత్సరాల నుంచి బయట డిన్నర్లకు వెళ్లడం మానేశాను. కేవలం సినిమా షూటింగ్‌లకు, ప్రమోషన్ల కోసం మాత్రమే బయటకు వస్తున్నా. నాకు అవుట్ డోర్ అంటే ఇంట్లో బాల్కనీలో కూర్చోవడం లేదంటే నా ఫామ్‌హౌస్‌కు వెళ్లడం అంతే. నా ప్రయాణాలంటే ఇల్లు, షూటింగ్, హోటల్, ఎయిర్‌పోర్టు, లొకేషన్, తిరిగి ఇంటికి రావడం, జిమ్‌కు వెళ్లడం. ఇవే నేను చేస్తున్న ప్రయాణాలు. నా కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా నా సిబ్బందితోనే గడుపుతున్నా.
షాపింగ్‌లకు కూడా వెళ్లడం మానేశాను. ఎప్పుడైనా మా అమ్మ బయటకు తీసుకెళ్లమంటే దగ్గర్లో ఉన్న హోటల్ లేదా కాఫీషాప్ వరకు తీసుకెళ్తున్నా’ అని చెప్పారు.ఇక ‘టైగర్’ సినిమా గురించి సల్మాన్ మాట్లాడుతూ.. తనకు ఆ స్టోరీ చెప్పిన సమయంతో సహా గుర్తుందన్నారు. ‘2012లో ‘ఏక్తా టైగర్’ సినిమా కథను దర్శకుడు మధ్యాహ్నం సమయంలో చెప్పారు. నాకెంతో నచ్చి వెంటనే అంగీకరించాను. యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో అదే నా తొలి చిత్రం. ఇప్పటికి కూడా నేను సూపర్ స్టార్ అని అనుకోవడం లేదు. నాకు వచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయగలుగుతున్నానా లేదా అన్నదే చూస్తాను. అలాగే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో చేయడానికి కూడా నేనేం ఆలోచించను. ప్రేక్షకులకు వినోదం అందించడమే నా లక్ష్యం’ అని సల్మాన్ అన్నారు. ‘టైగర్3’ఇప్పటి వరకు రూ.400 కోట్లు వసూళ్లను రాబట్టింది.