ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈటల మరోసారి గేమ్ ప్లాన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ కావాలని అధిష్ఠానాన్ని కోరినట్టు చెప్పారు. అంతేకాక తనకు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని.. అయినా సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కనక తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. ఈటల తాజా ప్రకటన వెనక భారీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ సారి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నారు. అసలు ఏ కారణంతో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారో తెలియదు. ఎందుకంటే బీజేపీ లో ప్రస్తుతం వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు టికెట్ ఆశిస్తున్న వారందరికీ ఓ కారణం ఉంది. వారు గతంలో పోటీచేసి ఓడిపోవడం.. సిట్టింగ్ ఎంపీలుగా ఉండటం.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీకి దూరం ఉండటం.. వంటి కారణాలతో వారంతా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఈటల మాత్రం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆయా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఇప్పటికే బలమైన అభ్యర్థులు ఉండటంతో కొత్త స్థానాన్ని ఎంచుకున్నారు. గతంలో కొత్త వారిని గెలిపించిన చరిత్ర మల్కాజిగిరి నియోజకవర్గానికి ఉన్నది. కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరిలో గెలుపొందారు. అందుకే ఈటల ఈ స్థానాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దానికి తోడు ఇక్కడ మోడీ వేవ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈటల ఇక్కడ గెలవాలంటే కచ్చితంగా కల్ట్ బీజేపీ అభిమానులు ఆయన కోసం పనిచేయాలి. వారంతా ప్రస్తుతం దాదాపుగా బండి సంజయ్ కు మద్దతు ఇస్తున్నవారే. దీంతో బండి సంజయ్ కరీంనగర్ లో గెలవాలంటే.. మీరు ఇక్కడ నాకు సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టుగా ఈటల వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పాత గేమ్ ప్లాన్ రిపీట్ చేస్తున్నాడా?
గతంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సొంత పార్టీ మీదే విమర్శలు గుప్పించారు. పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజల్లో విపరీతమైన సానుభూతి వ్యక్తమైంది. ఇదే అదనుగా భావించిన ఈటల అప్పటి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ అదే ప్లాన్ మరోసారి బీజేపీలోనూ రిపీట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ మీద కూడా ఈటల వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. చివరకు బీజేపీ పెద్దలు ఆగ్రహించి ఆయనను బయటకు పంపిస్తే.. ఆ సానుభూతితో మరోసారి గెలవొచ్చని ఈటల చూస్తున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో స్పెస్..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ నుంచి బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. కరీంనగర్ లో మాత్రం పెద్దగా బలమైన నేత లేరు. కాబట్టి ఈటల తమ పార్టీలో చేరితే కాంగ్రెస్ కచ్చితంగా స్వాగతిస్తుంది. ఆయనకు కరీంనగర్ టికెట్ ఇస్తుంది. అయితే కేవలం టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బీజేపీలో టికెట్ దక్కకుండా.. ఆ పార్టీ బలవంతంగా బయటకు పంపిస్తే ఈటలకు సింపతీ వస్తుంది. ఈ కారణంగానే ఆయన కొత్త గేమ్ కు తెరలేపారని తెలుస్తోంది. మరోవైపు తనకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వకపోతే .. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతా.. అక్కడి నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తా అనే పరోక్ష సంకేతాలు కూడా అధిష్ఠానానికి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ రెండు విధాలా లాభం చూసుకుంటున్నారు. ఒకవేళ అధిష్ఠానం మల్కాజిగిరి టికెట్ ఇస్తే తాను అక్కడి నుంచి పోటీ చేస్తాడు. లేదంటే పార్టీ నుంచి బయటకు వచ్చి .. టికెట్ ఇవ్వలేదు.. అవమానించిందని ఆరోపించి కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారు. ఇలా ఈటల తనదైన శైలిలో రాజకీయం నడుపుతున్నారు. మరి అధిష్ఠానం ఏం చేస్తుందో వేచి చూడాలి.