– మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
– రాజధాని ఫైల్స్ మూవీ వద్దకు పోలీసులను పంపుతారా?
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఇదేనిజం, ఏపీ బ్యూరో: ‘కుర్చీ మడతపెడతా’ అనే డైలాగ్ ను ఏపీ లీడర్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు. తన షర్ట్ మడతపెట్టే సమయం వచ్చిందంటూ సీఎం జగన్ నిన్న కామెంట్ చేయగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తాము కుర్చీలు పడతపెడతామని కౌంటర్ ఇచ్చారు. తాజాగా శుక్రవారం లోకేశ్ మాట్లాడుతూ.. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడతపెడితే.. మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ‘రాజధాని ఫైల్స్ సినిమా, రైతులంటే జగన్‌కు భయమేస్తోంది. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారు. మూడు రాజధానులన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? మూడు ముక్కలాట ఆడుతున్న వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడేం చెబుతారు? ఆ దుకాణాల వద్ద చర్చ పెట్టుకుందాం.. అక్కడికి వచ్చేందుకు సిద్ధమా? ’ అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.