Homeక్రైంజైషే ఉగ్రవాది హతం

జైషే ఉగ్రవాది హతం

– కరాచీలో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్​లో వరుసగా ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ సన్నిహిత అనుచరుడు రహీమ్‌ ఉల్లా తారిఖ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. తారిఖ్‌ను ఆగంతకులు మట్టుబెట్టారు. తమ దేశంలో వరుసగా జరుగుతున్నఉగ్రవాదుల హత్యలు పాక్‌ను కలవరపెడుతున్నాయి. జైషే ముఠా సభ్యుల మధ్య అంతర్గత పోరు కారణంగానే తారిఖ్ హత్య జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీలో అతిపెద్ద మురికివాడగా పేరున్న ఓరంగి టౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచే తారిఖ్‌పై పలుమార్లు కాల్పులు జరిపారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు తారిఖ్‌ అత్యంత సన్నిహితుడు. పాక్‌లో టాప్‌ ఉగ్రవాది హతమవడం ఈ నెలలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. గతవారం మరో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కమాండర్‌ అక్రమ్‌ ఘాజీని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అంతకుముందు ఈ నెల ఆరంభంలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఖ్వాజా షాహిద్‌ నియంత్రణ రేఖ సమీపంలోని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హతమయ్యాడు. తాజాగా తారిఖ్‌ హత్య చోటుచేసుకోవడంతో పాక్‌ మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనను పాక్‌ పోలీసులు ఖండించారు. ఇది ‘టార్గెట్​ మర్డర్’ అని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఇలా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురవుతున్నారు. దీంతో వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. భయంతో చాలా మంది ఉగ్రవాదులు రహస్య ప్రదేశాల్లో దాక్కున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img