అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే మించి ప్రభావం చూపిస్తోంది ! చూస్తుండగానే కుబేరుల సంపదను కోట్లలో ఆవిరి చేస్తుంది. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ( Jeff Bezoz ) మంగళవారం ఒక్కరోజులోనే 9.8 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. అంటే మన కరెన్సీలో 80 వేల కోట్ల రూపాయలు అన్నమాట !! జెఫ్ బెజోస్ ఒక్కరే కాదు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ( Elon Musk ) 8.4 బిలియన్ డాలర్లు ( రూ.70వేల కోట్లు ) నష్టపోయారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా స్పష్టం చేసింది. అమెరికా ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ( CPI ) జూలైతో పోలిస్తే 0.1 శాతం పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కాగా అమెరికా ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అది 8.3 శాతం మేర పెరిగింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజులుగా అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.