ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రెండేళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం దక్కింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే శేఖర్ 2021 సెప్టెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన భార్య సత్యలత కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఆమె ఏపీ స్థానికురాలనే కారణంతో అభ్యర్థనను తిరస్కరించి నియామకం చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన ప్రజావాణిలో సీఎంను కలిసి తనకు ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలు సడలించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ రవిగుప్తా, రాచకొండ సీపీ సుధీర్‌బాబును ఆదేశించారు. డీజీపీ సూచన మేరకు సీపీ సుధీర్‌బాబు సత్యలతను కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు.