ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో దాదాపు 5వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నామని కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సొల్యూషన్స్‌ను అందించే [24]7.ఏఐ తెలిపింది.
సాన్ జోస్ (క్యాలిఫోర్నియా) ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీకి.. భారత్‌లో హైదరాబాద్, బెంగళూరుల్లో మాత్రమే కార్యాలయాలున్నాయి.
వీటిలో సుమారు 6వేల మంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 5వేల మందిని నియమించుకునే దిశగా వెళ్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
దీంతో హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తునే ఉద్యోగావకాశాలు రానున్నాయి.
కాగా, కరోనా నేపథ్యంలో ఈ నియామకాల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సాగుతుందని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది.
సోషల్ మీడియా ద్వారా హెచ్‌ఆర్ టీం వర్గాలు అందించే అభ్యర్థుల ప్రొఫైల్స్‌తోపాటు ఎంప్లాయీ రెఫరల్స్, కన్సల్టెంట్స్, జాబ్ పోర్టల్స్ ద్వారా వచ్చే దరఖాస్తుల ఆధారంగా ఉద్యోగులను తీసుకుంటామని తెలియజేసింది.
అలాగే శాశ్వత ప్రాతిపదికనే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్‌ల నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.