తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నదే ప్రధాన నినాదంగా వినిపించింది.
ముఖ్యంగా, తెలంగాణ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయమైన వాటా లభించాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిందేనని నాయకులూ, ఉద్యమకారులూ చెబుతూ వచ్చారు.
తెలంగాణ ప్రజలకు రావాల్సిన ప్రభుత్వోద్యోగాలను ఆంధ్ర ప్రాంతం వారు తీసేసుకుంటున్నారన్న ఆరోపణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన అస్త్రం అయింది.
కానీ, రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళన అలాగే కొనసాగుతోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడత పాలనలో ఉస్మానియాలో ఆందోళనలు జరిగాయి.
లక్షల్లో ఉద్యోగాలు అన్న మాట ఊరించి, ఉసూరుమనించి వేలల్లో ఉద్యోగాల కోసం వేవేల ఎదరుచూపులుగా అయిపోయింది.
తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 50 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు కేసీఆర్ జూలై రెండో వారంలో ప్రకటించారు.
జోనల్ వ్యవస్థకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అన్నారు.
ఇంతకీ ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంకా ఎన్ని ఇస్తారు?
వాటితో కలిపేనా?
2018 ఎన్నికల సమయంలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేటీఆర్ చెప్పారు.
2018 నాటికి లక్షా 9 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
వాటిలో 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా, ఆ నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది.
ఆ తరువాత ఇప్పుడు లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
అయితే ఈ లక్షా 32 వేలు… ఆ లక్షా 12 వేలతో కలిపా కాదా? అన్నది ప్రశ్న.
ముందుగా ఈ లక్షా 32 వేల ఉద్యోగాల్లో ఏమున్నాయో చూద్దాం.
2021 మార్చి వరకూ 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.
వాటిలో 30,594 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చారు.
ఇక 31, 972 పోలీసు శాఖ ఉద్యోగాలు. పంచాయితీ కార్యదర్శులు 9,355, రెసిడెన్షియల్ స్కూల్స్ 3,623, ఆర్టీసీ 4,768, సింగరేణి 12,500, కరెంటు తయారీ, పంపిణీ సంస్థలు 6,648 పోస్టులు వీటిలో ఉన్నాయి.
అలాగే విద్యుత్ శాఖలో పర్మినెంటు చేసిన 22,637 ఉద్యోగాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవి కాక పలు చిన్న సంస్థలు, కోపరేటివ్ బ్యాంకులు, జలమండలి వంటివి ఆ జాబితాలో ఉన్నాయి.
మరో 6,258 ఉద్యోగాలు ఆ ప్రక్రియ చివర్లో ఉన్నాయి.
సంఖ్యాపరంగా చూస్తే ఈ లక్షా 32 వేల ఉద్యోగాలూ, అప్పట్లో కేటీఆర్ ప్రకటించిన లక్షా 12 ఉద్యోగాల కలిపే అవ్వాలి.
తాజాగా మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
వివిధ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆ ప్రకటన చేశారు. అయితే అవి ఏఏ శాఖల కింద అనేది మాత్రం స్పష్టత రావడం లేదు.
విద్యార్థుల ఆగ్రహం..
మరోవైపు ఈ లెక్కలతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో ఉద్యోగాల కోసం విద్యార్థుల ఆగ్రహం కొనసాగుతోంది.
ఇది రాజకీయ అంశంగా ఉంటూనే ఉంది.
ముఖ్యంగా తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే చాలా మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే గురి.
వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువు పూర్తయ్యాక కూడా క్యాంపస్‌లలో ఉంటూ సిద్ధం అవుతారు.
‘‘మేం ఉద్యమ పెద్దల మాటలు విన్నాం. శ్రీకృష్ణ కమిటీ రెండున్నర లక్షల ఖాళీలున్నాయని చెప్పింది.
బిస్వాల్ కమిటి లక్షా 91 వేల ఖాళీలంది. కానీ, ఏ నియామకమూ లేదు. ఇది మాకు నరకంలాగా ఉంది.
ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక నరకం చూస్తున్నాం’’ అని చెప్పారు నక్కా మహేశ్ అనే వ్యక్తి. ఆయన ఓయూలో ఎంఏ సోషియాలజీ చదివారు.
ఇప్పడు తెలంగాణ నిరుద్యోగుల ముందు రెండు సమస్యలు ఉన్నాయి.
ఒకటి ఉద్యోగం వస్తుందా రాదా? రెండు వస్తే ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే, తెలంగాణలో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశతో ఏళ్ల తరబడి ఇంట్లో వారి పోషణలో ప్రిపేర్ అవుతూ ఉంటారు.
ఉద్యోగాలు మానేసి చదివేవారూ, పెళ్లిళ్లు వాయిదా వేసి చదివే వారూ, అప్పు చేసి చదివే వారూ, పిల్లల్ని పుట్టింట్లో పెట్టి చదివేవారూ, తల్లితండ్రులు కూలి డబ్బులు పంపుతుంటే కోచింగ్ తీసుకునే వారూ.. ఇలా ఎందరో పేద, దిగువ మధ్య తరగతి యువత సర్కార్ నౌకరీ అనే కల కోసం శ్రమిస్తారు.
‘‘ఫలానా సమయంలో నోటిఫికేషన్ వస్తుంది అంటే దాని కోసం చదువుతాం. ఆ తరువాత ఉద్యోగం రాకపోతే, వేరే దానికీ చదువుతాం.
అదీ రాకపోతే మన ప్రాప్తం ఇంతే అనుకుని ఇంకో పనిచూసుకుంటాం. కానీ తెలంగాణలో మా పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే, నోటిఫికేషన్ వేస్తారో లేదో తెలియదు. వేస్తే ఎప్పుడు వేస్తారో తెలియదు.
ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలియదు. ఒకసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక పూర్తి అవడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు.
ఈలోపు వయసు పెరిగి, ఉద్యోగానుభవం లేక, ఇంట్లో వారికి భారం అయి, ఇంట్లో గొడవలయి, కెరీర్ నాశనం అయి నానా ఇబ్బందులూ పడుతున్నాం’’ అన్నారు మహేశ్.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
‘‘మేం లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం.
ఇంత భారీగా నియామకాలు ఎక్కడా జరపలేదు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది. చేపడుతోంది.
అంతేకాదు. ప్రైవేటు రంగంలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
ఆ క్రమంలో వేల ఉద్యోగాలు వస్తున్నాయి. వరంగల్ ఐటి హబ్‌గా అక్కడ చాలా కంపెనీలు వచ్చాయి.
ఇప్పుడు ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలు రాబోతున్నాయి.
ఇలా ఎన్నో ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణలో వస్తున్నాయి’’ అన్నారు టీఆర్‌ఎస్ నాయకులు కృశాంక్.
కేంద్రం ఐటీఐఆర్, రైల్ కోచ్ ఫాక్టరీ రద్దు చేయకుండా ఉండి ఉంటే మరికొన్ని వేల ఉద్యోగాలు తెలంగాణ వారికి వచ్చుండేవని ఆయన అన్నారు.
ఉద్యోగాల భర్తీలో ఆలస్యానికి తమ ప్రభుత్వం కారణం కాదంటున్నారాయన.
‘‘ఉద్యోగాల నియామకాల విషయంలో కేంద్రం రకరకాల కొర్రీలు పెడుతోంది. తెలంగాణను జోన్లుగా పునర్విభజించిన పత్రాన్ని గెజిట్‌గా ఇవ్వడానికి రెండు సంవత్సరాలు తీసుకున్నారు.
దానివల్ల చాలా ఉద్యోగాల ప్రక్రియ ఆలస్యం అయింది.
ఉదాహరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై ఎవరో కేసు వేశారని మొత్తం నియామకాలే ఆపాలని యూజీసీ వారు యూనివర్సిటీలకు లేఖలు రాశారు’’అని ఆయన గుర్తు చేశారు.
ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై ఇటీవల ప్రత్యేకంగా కేబినెట్ సమావేశంలో చర్చించారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది.
ఉద్యోగుల సంఖ్యపై అధికారుల నివేదిక సరిగా లేనందున మరింత సమయం తీసుకుని మళ్లీ వివరాలు తీసుకురావలని సీఎం ఆదేశించినట్టు ఆయన కార్యాలయం చెప్పింది.
అంతేకాదు, ఇకపై జాబ్ కాలెండర్లు ఇచ్చి వాటి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తారని కూడా చెప్పింది.
అటు ప్రైవేటు రంగంలో ఉపాధి పెంచేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.
కోర్టుల్లో జాప్యం
ఒకవేళ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదల చేసినా, అవి కోర్టు గుమ్మం దాటి వచ్చే సరికి ఏళ్లు పడుతోంది.
ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివిధ ప్రభుత్వ నిబంధనలు, వాటికి కోర్టులు చెప్పే బాష్యాలు కూడా నిరుద్యోగులకు చాలా ఇబ్బందికరంగా మారాయి.
పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లపై వందల సంఖ్యలో కేసులు వేస్తారు చాలా మంది.
నిబంధనలు తమకు అనుకూలంగా లేని ప్రతిసారీ కోర్టుకు వెళతారు.
‘‘నిజానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ నిబంధనలూ పెట్టదు. ప్రభుత్వ నిబంధనలు తీసుకుని అమలు చేస్తుంది.
అవి నచ్చని వారు కోర్టుకు వెళతారు. ఉదాహరణకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారికి వెయిటేజీ ఇవ్వమని ఒకసారి, ఇవ్వొద్దని ఒకసారీ కోర్టులు చెప్పాయి.
ఇప్పుడు ఏ తీర్పును తీసుకోవాలి? ఇలాంటివెన్నో నోటిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేయడానికి కారణాలుగా ఉన్నాయి.’’ అన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తోన్న ఒక ఉన్నతాధికారి.
ఇన్నేళ్లలో ఇన్ని కేసుల్లో ఎప్పుడూ కోర్టులు సర్వీస్ కమిషనర్ను తప్పు పట్టలేదని చెబుతున్నారు ఆ అధికారి.
గతంలో పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరిగాయి. 1987 నుంచీ ఇప్పటి వరకూ ఆ ఉద్యోగాల విషయంలో ఒక రూల్ ఉంది.
అదేంటంటే, అభ్యర్థి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే 4 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే 3 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తే 2 మార్కులూ వెయిటేజీ ఇస్తారు.
కానీ ఈసారి దానిపై కొందరు కోర్టుకువెళ్లారు. అలా సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఇవ్వకూడదని వారి వాదన.
బిస్వాల్ కమిటి లెక్కలేంటి?
తెలంగాణ ఉద్యోగుల జీతాలు సవరించేందుకు వేసిన బిస్వాల్ కమిటీ తెలంగాణలో 1 లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు చెప్పిందని నిరుద్యోగులు ప్రతిపక్షాలు అంటున్నాయి.
అయితే ప్రస్తుతం పనిచేస్తోన్న కాంట్రాక్టు కార్మికులను కూడా కలిపి ఆ లెక్క చెబుతున్నారు టిఆర్ఎస్ నాయకులు కృశాంక్ అన్నారు.
సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలను ఇప్పుడు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయడం లేదు. దాన్ని కలుపుకుని బిస్వాల్ చెప్పిన లెక్క సరైంది కాదు అని ఆయన అన్నారు.
యూపీఎస్సీతో పోలిక
‘‘కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపే ప్రక్రియ పద్ధతిగా ఉంది. అక్కడ సిబ్బంది చాలా ఎక్కువ.
ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం అనుమతించిన పోస్టులనే సర్వీస్ కమిషన్ నియమిస్తుంది’’ అంటూ తమ సమస్య చెప్పారు టీఎస్పీఎస్సీలో పనిచేసే ఒక వ్యక్తి.
‘‘అంతేకాదు, యూపీఎస్సీ ఏడాది మొత్తం నింపే ఉద్యోగాలు, రాష్ట్రాల కమిషన్లు ఒక్క నోటిఫికేషన్లోనే నింపుతాయి.
పదింతలు ఉద్యోగాలు, పది రెట్లు తక్కువ సిబ్బందితో భర్తీ చేస్తున్నాం’’.
‘‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు మెరుగుపర్చడం, నియామక ప్రక్రియను మెరుగుపర్చడంపై ప్రొఫెసర్ రామకృష్ణయ్య కమిటి పలు సూచనలు చేసింది. అవి పెండింగులోనే ఉన్నాయి’’.
‘‘నిజానికి తెలంగాణ ఏర్పడ్డ తరువాత భారీ స్థాయిలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఉద్యోగాలు భర్తీ చేశారు.
ప్రభుత్వానికి ఆ రంగాల్లో ఆసక్తి ఉంది. వెంటనే ఉద్యోగాలు వేసింది’’ అని వ్యాఖ్యానించారు ఆ అధికారి.