- బీఆర్ఎస్ వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుందా?
- బీఆర్‌ఎస్ నేతల కాంగ్రెస్‌లో చేరికలపై సొంత
పార్టీలోనే వ్యతిరేకత - పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో జోరుగా చర్చ..
- హస్తం తీరుపై క్యాడర్, ప్రజల్లోనూ అసంతృప్తి..
- ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అవే ముఖాలు..
ఇదే నిజం, వరంగల్ ప్రధాన ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాల్లో మలుపులు, ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేరుతున్నారు. కనీసం నైతిక విలువలు పాటించడం లేదు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే గతంలో బీఆర్‌ఎస్ అవలంబించిన విధానాన్నే కాంగ్రెస్ అనుసరిస్తుందని ప్రజలు, సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. టికెట్ల కోసం కొందరు, ఆస్తులను కాపాడుకునేందుకు మరికొందరు, పదవుల కోసం ఇంకొందరు ఇలా ఎవరికి వారు స్వార్థంతో పార్టీ మారిపోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూసి జనం ఛీ కొడుతున్నారు. ఈ ముఖాలను చూడలేకనే ఎన్నికల్లో ఓడిస్తే మళ్లీ పార్టీలు మారి మరో కండువా కప్పుకొని ప్రజల వద్దకు నిసిగ్గుగా వెళ్లిందుకు సిద్ధమవుతున్నారు.
నైతికత లేని నాయకులు..
రాజకీయాల్లో రోజురోజుకూ నైతిక విలువలు పడిపోతున్నాయి. అధికారం లేకపోతే ఒక క్షణం ఆగలేకపోతున్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ అధికారం కోల్పోతే అండగా ఉండాల్సింది పోయి.. క్షణం ఆలోచించకుండా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరుతున్నారు. కౌన్సిలరు నుంచి మొదలు కొని చైర్మన్ వరకు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు అదే ధోరణి.. ఇటీవల వరంగల్ జిల్లాలో నర్సంపేటలో పార్టీ మారిన ఓ నేతను మహిళా చెప్పు తీసుకొని కొట్టింది. ఇది నాయకులకు గుణం పాఠం కావాలి. కానీ, కొందరు నాయకులకు ఇవేం పట్టడం లేదు. అధికార దాహంతో పార్టీ మారిపోతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదే తీరు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్‌లోకి వెళ్లారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేసి విచ్చలవిడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకున్నది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. గులాబీ పార్టీ ఓటమికి కారణమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. వరంగల్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ టికెట్ ఆశించారు. బీఆర్‌ఎస్ అనూహ్యంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇచ్చింది. దీంతో దయాకర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయన పేరు పరిశీలనలో ఉంది. అయితే, అదే పార్టీ నుంచి దొమ్మాటి సాంబయ్యతోపాటు మరికొంతమంది పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు దొమ్మాటి సాంబయ్యకు టికెట్ వస్తుందని అందరూ భావించిన అనూహ్యంగా దయాకర్ పేరు తెరపైకి రావడంతో సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. బీఆర్‌ఎస్ లోనే సీటు దక్కని వ్యక్తికి కాంగ్రెస్ ఎలా ఇస్తారని సొంత పార్టీలోనే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ నగర్ మేయర్ గుండా సుధారాణి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే, ఆమె, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ ఉండటంతో ఆమె చేరిక కొంత ఆలస్యమవుతున్నది. అదే విధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీలు ఇలా వివిధ పదవులు అనుభవిస్తున్నవారు సైతం కాంగ్రెస్ పంచన చేరుతుండటంతో ప్రజల్లో చర్చ మొదలైంది. అధికారం లేకపోతే ఆగలేరా? రాజకీయా జీవితాన్ని ఇచ్చిన పార్టీకి దూరమవుతారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, చేరికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.