Homeజాతీయంపిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్టులు... వారు ఫ్రంట్‌లైన్ వారియర్స్​ కాదా..?

పిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్టులు… వారు ఫ్రంట్‌లైన్ వారియర్స్​ కాదా..?

ప్రస్తుతం ప్రజలకు ఈ మాత్రం న్యాయం, వైద్యం అందుతుందంటే దానికి కారణం ప్రజల తరపున జర్నలిస్టుల పోరాటమే.

జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి సమస్యలను ఎత్తి చూపకపోతే ప్రజలను పట్టించుకునే నాథుడే ఉండడు.

కానీ కనీసం అధికారికంగా వ్యాక్సిన్​ అందుకునే అవకాశం కూడా లేని దుర్బర స్థితిలో ఉన్నారు ప్రస్తుత జర్నలిస్టులు.

మీడియా సంస్థల్లో పని చేసే విలేఖర్లపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది.

వృత్తి రీత్యా కోవిడ్ ప్రభావిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ఇలా అన్ని చోట్లకు వారు వెళ్లాల్సి ఉంటుంది.

అలా అనేక ప్రాంతాలలో తిరిగి తిరిగి వారు మళ్లీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

సుమారు 10 నుంచి 20 శాతం మినహా, చాలా మీడియా సంస్థల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఉండదు.

దీంతో ఆఫీసులో పని చేసేవారు, ఫీల్డులో ఉండేవారు.. ఇలా రెండు రకాల జర్నలిస్టులు కోవిడ్ బారిన పడుతున్నారు.

మిగిలిన వ్యవస్థల్లో ఉన్నంత కట్టుదిట్టమైన ఉద్యోగ భద్రత, బీమా, ధీమా.. ఇవేవీ తెలుగు మీడియా రంగంలోని జర్నలిస్టులకు లేవు.

దీంతో మహమ్మారి వారి జీవితాలను మరింత దుర్భరంగా మార్చేసింది.

ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కాదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్ లైన్ వర్కర్స్‌గా గుర్తించిన వారికి కొన్ని సదుపాయాలు ఇచ్చింది.

వాటిలో అతి ముఖ్యమైనది వ్యాక్సీన్. కానీ 2021 ఏప్రిల్ వరకూ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా గుర్తించలేదు.

పోలీసులు, కొన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య రంగంలో పనిచేసే వారికి వ్యాక్సీన్ అందింది తప్ప విలేఖర్లకు వ్యాక్సీన్ వేయలేదు.

రెండో వేవ్‌లో మిగిలిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల కంటే విలేఖర్ల మరణాల శాతం ఎక్కువగా ఉండటానికి ఇది కారణమైంది.

ఇటీవలి కాలంలో ఒక్కొక్క రాష్ట్రం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా గుర్తిస్తూ వస్తున్నాయి. కేంద్రం కూడా గుర్తించింది.

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జర్నలిస్టులకు ఆ అవకాశం దక్కలేదు. దీంతో తెలుగు మీడియాలో పని చేసేవారికి ఎలాంటి భద్రతా లేకుండా పోయింది.

వాస్తవానికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ జాబితాలో ఉంటే జర్నలిస్టులకు దక్కే ఏకైక ప్రయోజనం వాక్సీన్ మాత్రమే. ఎందుకంటే, మిగిలిన ఫ్రంట్‌లైన్ వర్కర్లలో మెజారిటీ గవర్నమెంటు ఉద్యోగులు. వారికి ప్రభుత్వ సాయం అందుతుంది.

ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే వారికి కొంతలో కొంతైనా సాయం అందుతుంది.

ఇక ప్రైవేట్‌ రంగంలోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో వివిధ ఆసుపత్రుల్లో పని చేసేవారు ఎక్కువ. వారికి కార్మిక చట్టాలు అమలవుతాయి కాబట్టి సమస్య లేదు.

కానీ, జర్నలిస్టులదే పెద్ద సమస్య. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మీడియా సంస్థలు కార్మిక చట్టాలను పాటించవు.

దీంతో వారికి ఉద్యోగిగా వచ్చే కనీస సౌకర్యాలు, భద్రతా దొరకవు.

బాగా పెద్ద మీడియా సంస్థలు తమ సిబ్బందికి ఆరోగ్యం బీమా కల్పిస్తాయి. కానీ మెజార్టీ సంస్థల్లో ఆ సదుపాయం ఉండదు.

అలాగే స్టాఫ్ కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున తెలుగు మీడియాలో పని చేస్తున్నారు.

స్ట్రింగర్లు, కంట్రిబ్యూటర్లు, లోకల్ రిపోర్టర్లుగా పిలిచే ఈ ఫ్రీలాన్సర్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. వీరికి జీతం ఉండదు, వారు అందించిన న్యూస్ ఆధారంగా నగదు చెల్లిస్తారు.

దీంతో వీరికి ఏ భద్రతా ఉండదు. కానీ వారు కూడా ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లలానే పని చేయాల్సి ఉంటుంది.

వందల్లో మరణాలు

కరోనా మొదటి, రెండో వేవ్‌లలో జర్నలిస్టులు చాలా మంది మరణించారు.

తెలంగాణలో మొదటి వేవ్‌లో 26 మంది, రెండో వేవ్‌లో ఇప్పటి వరకూ 59 మంది మరణించారు.

ఒక్క ఏప్రిల్‌లోనే 40 మంది చనిపోయారు. వీరిలో 10 మంది తప్ప అంతా పేదవారే.

ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేనివారే. పైగా చనిపోయిన వారిలో ఫ్రీలాన్సర్లే ఎక్కువ. వాళ్లు దాదాపు 50 శాతం మంది ఉన్నారు.

తెలుగు మీడియాలో ఫ్రీలాన్సర్లు డైలీ కూలీలతో సమానం. అందులోనూ, చనిపోయినవారిలో యువ జర్నలిస్టులే ఎక్కువ.

40 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారు 33 మంది చనిపోయారు.

వైద్యం కష్టం – పరిహారం లేదు

ధర్మాసనం శ్రీధర్, అమర్‌నాథ్, భళ్లమూడి రామకృష్ణ, టీఎన్ఆర్.. ఇలా ఎందరో జర్నలిస్టులు కరోనా కారణంగా మరణించారు.

తెలంగాణలో జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ఏ ఆసుపత్రిలోనూ చెల్లడం లేదు. వారికి బీమా సౌకర్యం కల్పించాలి.

ఎన్నోసార్లు, ఎందరికో లేఖలు రాశాం, ఆన్‌లైన్ క్యాంపెయిన్ చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదు.

తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

వీళ్లేం పాపం చేశారు? వాళ్లను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా ఎందుకు గుర్తించడం లేదు? మిగిలిన వారిలానే వారు కూడా సమాచారం పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు కదా?

తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం ఐసోలేషన్‌లో ఉన్న జర్నలిస్టులకు రూ.20 వేల సాయం అందించింది.

కానీ ఈసారి అది పెద్దగా అమలు కావడం లేదు.

అలాగే మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రెస్ అకాడమీ తరపున రూ.2 లక్షల సాయం అందిస్తున్నారు.

కానీ బతికుండగా వైద్యం చేసే ఏర్పాట్లు లేవు. అటు రూ.2 లక్షల మొత్తంపై కూడా విమర్శలు ఉన్నాయి.

జర్నలిస్టులు మరణిస్తే రూ.25 లక్షల రూపాయల సాయం చేయాలని కోరుతూ కొందరు సీనియర్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

విలేఖర్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని కోరారు.

హోం ఐసోలేషన్‌లో ఉండే జర్నలిస్ట్ కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సహా అనేక పార్టీల నాయకులు ఇవే తరహా డిమాండ్లు చేశారు.

ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆసుపత్రి బిల్లులకు కూడా సరిపోదు. ఇక అంత్యక్రియల నుంచి అన్నిటికీ కుటుంబం అప్పు చేయాల్సిందే.

ప్రస్తుతం బిహార్, తమిళనాడు, పంజాబ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జర్నలిస్టు మరణిస్తే రూ.10-15 లక్షల వరకూ పరిహారం ఇస్తున్నట్టు జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలో జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరోలా ఉంది.

మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహారం ఇవ్వడానికి గత ఏడాది ఐజేయూ నేతల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగీకరించారు.

ఆ మేరకు ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ పథకం అమలు కాలేదు.

2021 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల డీపీఆర్ఓల నుంచి ఐ అండ్ పీఆర్ శాఖకు మొత్తం 36 మంది జర్నలిస్టులకు సాయం కోసం ప్రతిపాదనలు రాగా, అందులో నుంచి 26 మందిని ఆ శాఖ ఎంపిక చేసింది. వారికి కూడా ఇంకా సాయం అందలేదు.

కరోనా వల్ల సెలవు పెట్టిన జర్నలిస్టులకు చాలా సందర్భాల్లో యాజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదు.

దీంతో తాత్కాలిక భృతి, వైద్యం కోసం కొంత మొత్తం ప్రభుత్వం కూడా ఇవ్వాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

’కనీసం టీకా వేయించండి‘

మిగతా అన్నీ పక్కన పెట్టినా, జర్నలిస్టులకు కనీసం టీకా అయినా వేయించాలని వేడుకుంటున్నారు ఫీల్డ్ రిపోర్టర్లు.

చట్ట ప్రకారం వీరు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కాదు కాబట్టి టీకా అందలేదు.

18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సీన్ కోటా ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి అలా కూడా వీరికి టీకా అందదు.

ఏప్రిల్‌లో వ్యక్తిగతంగా వైద్య రంగంలో పరిచయం ఉన్నవారి ద్వారా 5-10 శాతం మంది మాత్రం టీకా పొందగలిగారు. మిగిలిన వారికి ఆ అవకాశం లేకుండా ఉంది.

విజయవాడలో జర్నలిస్టులకు టీకా వేయించాలని అక్కడి స్థానిక రిపోర్టర్లు దాదాపు 10 రోజులుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు.

ఆరోగ్య శాఖ, సమాచార శాఖ సానుకూలంగా స్పందించినా, కృష్ణా జిల్లా యంత్రాంగం సానుకూలంగా లేకపోవడంతో ఆ కార్యక్రమం ముందుకు సాగడం లేదు.

జర్నలిస్టులుగా పనిచేస్తున్న అతి కొద్ది మందికి కొందరు వైద్యులు లేదా సమాజంలో పలుకుబడి ఉన్నవారితో వ్యక్తిగత పరిచయం ఏర్పడుతుంది.

దాని సాయంతో కొందరు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో అడ్మిషన్ వంటివి సంపాదించగలుగుతున్నారు. కానీ వీరి శాతం చాలా తక్కువ.

ఆంధ్ర, తెలంగాణల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ ఉన్నవారి సంఖ్య 35-40 వేల మధ్య ఉంటుందని ఓ అంచనా.

చాలా కాలం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం జర్నలిస్టులు డిమాండ్లు చేస్తున్నారు.

ఇల్లు సంగతి దేవుడెరుగు.. కనీసం టీకా అయినా వేయించండని వేడుకుంటున్నారు విలేఖర్లు.

Recent

- Advertisment -spot_img