– రేపు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు
ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 3న తీర్పు వెలువరించనున్నట్టు తెలిపింది. ‘కోర్టు ఆదేశాలను ఎక్కడా అతిక్రమించలేదు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయి. సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులు హరించే విధంగా ఉన్నాయి. కేసు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సీఐడీ అధికారులు చెప్పలేకపోతున్నారు’అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగ్స్‌ను సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. కోర్డు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మీడియాతో మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ర్యాలీలు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా…రాజమహేంద్రవరం నుంచి 13 గంటల పాటు ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ శుక్రవారం తీర్పును వెల్లడించనున్నట్లు పేర్కొంది.