ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలంగాణలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,36,595 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ఇప్పటికే 1,043 అడుగుల నీరు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.532 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. వరద ఉదృతి తగ్గకపోగా భారీగా పెరుగుతుండడంతో అధికారులు 13 గేట్లను ఎత్తివేసారు. అయినప్పటికీ బయటకు వెలుతున్న నీటితో పోలిస్తే వచ్చి చేరుతున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉంది.