Homeతెలంగాణఒక్క కామెంట్​.. కొంపముంచిందా?

ఒక్క కామెంట్​.. కొంపముంచిందా?

– చంద్రబాబు అరెస్ట్​ అనంతర ఆందోళనలపై
కేటీఆర్​ వ్యాఖ్యలు వివాదాస్పదం
– కమ్మ ఓటర్లు దూరమయ్యారని ప్రచారం?
– భావోద్వేగాలు పీక్స్​లో ఉన్న టైమ్​లో నొప్పించేలా ఐటీ మంత్రి వ్యాఖ్యలు
– తనకు అనుకూలంగా మలుచుకున్న పీసీసీ చీఫ్​ రేవంత్​
– గురితప్పిన కేటీఆర్​ వాగ్బాణం
– 30 స్థానాల్లో టీడీపీ అధినేత సామాజికవర్గానికి బలం
– దిద్దుబాటు చర్యలకు దిగిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు
– కమ్మ సామాజికవర్గం సోపోర్ట్​ ఎవరికి?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్​ను కమ్మ సామాజికవర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. తమ ఇంట్లో మనిషి అరెస్ట్​ అయినట్టు వారు భావిస్తున్నారు. ఎంతో అవమానకరంగా ఫీల్​ అవుతున్నారు. కక్ష పూరితంగా చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని వారు భావిస్తున్నారు. బాబు అరెస్ట్​ అంశం కమ్మ సామాజికవర్గంలో భావోద్వేగాన్ని నింపింది. అందుకే చంద్రబాబు సామాజికవర్గం బలంగా ఉన్న చోటే ఆందోళనలు జరగుతున్నాయి. కమ్మ సామాజికవర్గం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో బలమైనది. మరోవైపు రాజకీయంగా కూడా వారు దశాబ్ధాల పాటు ఉమ్మడి ఏపీలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్​ ను కమ్మలు సీరియస్​ గా తీసుకున్నారు. కమ్మ సామాజికవర్గం ఏపీలోని అనేక జిల్లాల్లో విస్తరించడంతోపాటూ తెలంగాణ రాష్ట్రంలోనూ వారికి బలముంది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని పలు సెగ్మెంట్లలో.. నిజమాబాద్​, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వారికి పట్టుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కమ్మ సామాజికవర్గం బీఆర్ఎస్​కే మద్దతు ఇస్తున్నారు. కూకట్​ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​, మంత్రి పువ్వాడ అజయ్​, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూటి గాంధీ, సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​ రావు, ఎంపీ నామానాగేశ్వర్​ రావు వీరంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే.

బీఆర్ఎస్​ పార్టీకే కమ్మల మద్దతు
తెలంగాణ ఆవిర్భావం అనంతరం కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కమ్మ సామాజికవర్గం బీఆర్ఎస్​ కు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్​ చేసిన కామెంట్లు వీరికి కోపం తెప్పించాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇటీవల చంద్రబాబు అరెస్ట్​ అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులు .. బాబుకు మద్దతుగా ఐటీ కారిడార్​ లో ఆందోళనలు చేపట్టారు. కాగా ఈ ఆందోళనల పట్ల మంత్రి కేటీఆర్​ కాస్త సీరియస్​ అయ్యారు. ఐటీ కారిడార్​ లో ఆందోళనలు ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆంధ్రాప్రాంతంలో నిరసనలు చేసుకోవాలన్నారు. ఈ కామెంట్లతో కమ్మ సామాజికవర్గానికి చెందని ప్రజలు కాస్త నొచ్చుకున్నట్టు సమాచారం. భావోద్వేగాలు పీక్స్​ లో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్​ అటువంటి కామెంట్లు చేసి ఉండాల్సింది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ సామాజికవర్గానికి కొన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంక్​ ఉంది. అయితే సెటిలర్లు అంటే కేవలం కమ్మ సామాజికవర్గం వాళ్లు, చంద్రబాబు అభిమానులు మాత్రమే కాదు కదా.. అన్న చర్చ కూడా సాగుతోంది. సెటిలర్లలో జగన్​ అభిమానులు కూడా ఉంటారు కదా.. అన్న వాదన వినిపిస్తోంది.

సీపీ స్థాయి వ్యక్తి స్పందించాల్సిన చోట.. కేటీఆర్​ ఎంట్రీ
నిజానికి రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఆందోళనలు జరగుతుంటే పోలీసులు, అధికారులు ఆందోళనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. అధికారంలో ఉన్న నేతలు స్పందించడం వల్ల కొన్ని సార్లు కామెంట్స్​ బూమరాంగ్​ అవుతుంటాయి. హైదరాబాద్​ నగరంలోని ఐటీ కారిడార్​ లో చిన్నపాటి ఆందోళన జరిగితే దానికి కేటీఆర్​ ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్​ అయ్యారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భావోద్వేగాలు ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పుడు సహజంగా రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంటారు. కానీ కేటీఆర్​ కొంత దూకుడుగా రియాక్ట్​ అయ్యారు. దీంతో కమ్మలు బీఆర్ఎస్​ కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా భావించిన రేవంత్​.. చంద్రబాబుకు, ఆయన అభిమానులకు అనుకూలంగా మాట్లాడారు. రేవంత్​ చంద్రబాబు శిష్యుడన్న ప్రచారం ఉంది. ఆయనను బాబే కాంగ్రెస్ పార్టీలోకి పంపించాటరని కొంతమంది భావిస్తుంటారు. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గం ఓటర్లు కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల రేణుకా చౌదరి సైతం కమ్మ జేఏసీ లీడర్లను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లొచ్చారు. తమకు 10 సీట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు.

బీఆర్ఎస్​ దిద్దుబాటు స్టార్ట్​..
కేటీఆర్​ వ్యాఖ్యలతో కమ్మ సామాజికవర్గం నేతలు నొచ్చుకున్నారని భావించి బీఆర్ఎస్​ లీడర్లు వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. హరీశ్​ రావు లీడర్లు సైతం బాబు అరెస్ట్​ విషయంలో స్పందించారు. పలుచోట్ల బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు అరెస్ట్​ ను ఖండించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్​ రంగంలోకి దిగి ఈ తలనొప్పిని కొంత తగ్గించే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం ఎన్నికల వేళ యాక్టివ్​ అయ్యింది. వారు ఏ పార్టీకి ఓటేయబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్​గా మారింది. కేటీఆర్​ వ్యాఖ్యలు బూమరాంగ్​ అయి కమ్మల ఓట్లు ఇతర పార్టీలకు మళ్లుతాయా? లేక మళ్లీ బీఆర్​ఎస్​ కే పడతాయా? అన్నది వేచి చూడాలి.

Read More:

KTR : Sentiment కలిసొచ్చింది గెలుపుమాదే
http://idenijam.com/ktr-we-achieved-success-by-uniting-the-sentiment/

Recent

- Advertisment -spot_img