Justice DY Chandrachud : భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఆయన నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నలుగురు న్యాయమూర్తులకు సరైన అధికారిక నివాసాలు లేనందున, ఈ బంగ్లా తిరిగి కేటాయించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నెలల తరబడి ప్రభుత్వ బంగ్లాలో కొనసాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
జస్టిస్ చంద్రచూడ్ గత ఏడాది పదవీ విరమణ చేసినప్పటికీ, అధికారిక నివాసాన్ని ఇప్పటివరకు ఖాళీ చేయలేదు. సాధారణంగా సీజేఐలు పదవీ విరమణ తర్వాత నిర్దిష్ట గడువులోగా అధికారిక నివాసాన్ని వదిలివేయాల్సి ఉంటుంది. చంద్రచూడ్ విషయంలో ఈ గడువు మే 31 వరకు పొడిగించినప్పటికీ, ఆయన ఇంకా బంగ్లాను ఖాళీ చేయకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్, తమ కూతుర్లకు ఉన్న ఇబ్బందుల వల్ల బంగ్లా ఖాళీ చేయడం ఆలస్యమైందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఈ వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.
పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న మాజీ చీఫ్ జస్టిస్, తమ కూతుర్లకు నచ్చిందని ప్రభుత్వ బంగ్లాను వాడటం, అందులో నెలల తరబడి తిష్ట వేయడం ఏంటి అని కొందరు మండిపోతున్నారు. చివరికి సుప్రీంకోర్టు తప్పుబట్టి ఖాళీ చేయమని ఆర్డర్ వేయడం గమనించాల్సిన విషయం అని అంటున్నారు. ఇదే సుప్రీంకోర్టుకు మొన్నటి దాకా ఆయనే చీఫ్ జస్టిస్ కావడం, ఇప్పుడు అదే సుప్రీంకోర్టు నుంచి ఆయనకు ఆదేశాలు వెలువడటం “ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి” అనే సామెతను జస్టిస్ చంద్రచూడ్ నిజం చేస్తున్నాడు అని కొందరు అంటున్నారు. ఈ ఘటన సుప్రీంకోర్టు గౌరవానికి భంగం కలిగించే అంశంగా మారింది.