Homeహైదరాబాద్latest Newsకడక్ ఖాకీలు.. లొంగరు.. వంగరు.. ఎవరిమాట వినరు.. డ్యూటీయే వారికి గాడ్

కడక్ ఖాకీలు.. లొంగరు.. వంగరు.. ఎవరిమాట వినరు.. డ్యూటీయే వారికి గాడ్

  • పొలిటీషియన్లు అంటే భయపడరు
  • ఏరి కోరి కీలక పోస్టులకు ఎంపిక చేసిన ప్రభుత్వం
  • డ్యూటీయే వారికి గాడ్.. ప్రభుత్వ వేతనమే ఆధారం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కడక్ ఖాఖీలు ఉన్నారు. ఎవ్వరికీ లొంగరు.. ఎవ్వరి మాటా వినరు. ఒక్కసారి సీన్ లోకి వెళ్లారంటే చట్టమే వారికి దైవం. డ్యూటీ తప్ప ఇంకేమీ పట్టని అధికారులు వారు. ఈ ఖాకీలు మొండివాళ్లని తెలిసి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం వారిని కీలక పోస్టుల్లో నియమించదు. ఏదో లూప్ లైన్ పోస్టులు అంటగడతారు. ఎక్కడికెళ్లినా ప్రభుత్వ వేతనం తప్ప ఇంకేమీ ఆశించరు కాబట్టి.. ఏ శాఖకు వెళ్లినా కడక్ ఖాకీలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అధికారులను ఏరి కోరి కీలక పోస్టుల్లో నియమించారు. వారే ఏసీబీ డీజీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ అధికారులు కడక్ ఆఫీసర్లుగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందుతూ.. రాజకీయ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

సీవీ ఆనంద్ .. నో కాంప్రమైజ్
సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా నో చేంజ్. డ్యూటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడన్న పేరుంది. ఈ కేసును టేకోవర్ చేసినా డెప్త్ లోకి వెళ్లిపోతాడు. మూలాల నుంచి కేసు కూపీ లాగుతాడు. కేసులో ఇన్వాల్వ్ అయ్యింది మంత్రులైనా.. కీలక వ్యక్తులైనా లెక్క చేయడు. అవసరమైతే అధికార పార్టీ నేతలను కూడా ఎదురిస్తాడు. ప్రభుత్వంలోని పెద్దలను మెప్పించి మరీ కేసును డీల్ చేయడం ఇతడి స్టైల్. అందుకే గత కేసీఆర్ హయాంలోనూ కీలక బాధ్యతలు చేపట్టిన ఆనంద్. ఇప్పుడు రేవంత్ సర్కారులోనూ కీలక పదవిలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ సీపీగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు ఆనంద్. ఇక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనంద్ ను ఏరికోరి పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా నియమించారు. సహజంగా ఈ పోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సీవీ ఆనంద్ నిజాయితీని పరిగణనలోకి తీసుకొని ఈ కేసును ఆయనకు అప్పగించారు. ఇక పౌరసరఫరాలశాఖలో ఈటల అవినీతి వ్యవహారం ఆనంద్ కమిషనర్ అయ్యాకే వెలుగులోకి వచ్చింది. ఈ శాఖలో భారీగా అవినీతిని సీవీ ఆనంద్ నియంత్రించగలిగారు. అప్పట్లో ఈటల బహిరంగ ఆరోపణలు చేశారంటే సీవీ ఆనంద్ ఎంత నిక్కచ్చిగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి ఆయనను ఏసీబీ డీజీగా నియమించారు. ఇక ఆనందర్ చార్జ్ తీసుకున్నాక.. ఏసీబీ కొత్త పుంతలు తొక్కుతోంది. అవినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట ఏసీబీ రెయిడ్స్ జరుగుతూనే ఉన్నాయి. అవినీతి అధికారులు తప్పించుకొనేందుకు ఎన్ని పన్నాగాలు పన్నినా.. ఎత్తుకు పైఎత్తు వేసి వాళ్లను అదుపులోకి తీసుకుంటామని తాజాగా ఆనంద్ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో గొర్రెల స్కామ్ దగ్గరినుంచి అనేక అక్రమ కేసులను ఏసీబీ డీల్ చేస్తోంది. తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ నే పట్టుకున్నారంటే ఏసీబీ ఎంత సీరియస్ గా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

కొత్తకోట .. ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు
ఒక హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కొత్తకోట పేరు చెబితేనే రాజకీయ నాయకులకు హడల్. అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. అందుకే ఆయనను ఏ రాజకీయనాయకుడు కోరుకోరు. కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెడతారు. ఈ కారణంగానే కొత్తకోటకు గత బీఆర్ఎస్ హయాంలో లూప్ లైన్ పోస్టులు దక్కాయి. ఆయనకు ప్రాధాన్యత లేని ఆక్టోపస్ వింగ్ లాంటి పోస్టులు ఇస్తుంటారు. రేవంత్ రెడ్డి మాత్రం కీలకమైన హైదరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. డ్యూటీలో కొత్తకోట ఎవరిమాట వినరు. మొండిఘటం అన్న పేరుంది. బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో పంజాగుట్ట పీఎస్ కు చెందిన ఒకరిద్దరు పోలీసులు అతడికి సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కొత్తకోట.. మొత్తం స్టేషన్ అంతా బదిలీ చేశాడు. ఒకేసారి దాదాపు 85 మంది సిబ్బందిని ఒక్కదెబ్బతో బదిలీ చేశాడు. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. దేశంలోనే ఇదో రికార్డ్ గా నిలిచింది. కొత్త కోట మొండి ధైర్యానికి, పనిలో నిక్కచ్చి తనానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

చట్టం చెప్పిందే.. అవినాశ్ పాటిస్తాడు
మరో కడక్ లాంటి పోలీస్ ఆఫీసర్ అవినాశ్ మహంతి.. 2005 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవ్వరి మాట వినడు. కేవలం చట్టం చెప్పింది మాత్రమే వింటారు. అవినాశ్ ముందు మంత్రి ఉన్నా.. ఆటో డ్రైవర్ ఉన్నా ఆయనకు సంబంధం లేదు. చట్టం ఏం చెప్పిందో అది మాత్రమే చేస్తాడు. తన తండ్రి ఏకే మహంతి ( అజిత్ కుమార్ మహంతి) నుంచి ఆయన ఈ నిజాయితీని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మామూళ్లు, పై సంపాదన అనే మాట ఎరగడు అవినాశ్ మహంతి. అందుకే ఆయనకు ఏ పోస్టింగ్ ఇచ్చినా సంతోషంగా వదిలిపెట్టి వెళ్లిపోతాడు. కేవలం ప్రభుత్వం జీతం మాత్రమే తీసుకొని పనిచేసే అతికొద్దిమంది ఆఫీసర్లలో అవినాశ్ కూడా ఒకరు. మంత్రుల సిఫారసులు.. ఫ్రెండ్లీ పోలిసింగ్ లాంటి కబుర్లు అవినాశ్ దగ్గర పనిచేయవు. న్యాయం ఎవరివైపు ఉంటే వారిపైపే నిలబడే ఆఫీసర్ అవినాశ్. అందుకే కడక్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు.

అన్న, నాన్న బాటలో అభిషేక్ మహంతి
అవినాశ్ మహంతి సోదరుడు అభిషేక్ మహంతి సైతం సేమ్ అన్నదారిలో పయనిస్తున్నాడు. నిజాయితీ విషయంలో తిరుగుండదు. అక్రమార్కులంటే భయముండదు. భూ కబ్జాదారులు కనిపిస్తే వాళ్ల లెక్కలు తేల్చి ఊచలు లెక్కబెట్టేలా చేస్తాడు అభిషేక్. అవినాశ్ మహంతి సోదరుడు, ఏకే మహంతి కుమారుడైన అభిషేక్.. 2011 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కరీంనగర్ సీపీగా పనిచేస్తున్న ఈ ఆఫీసర్ భూ కబ్జాదారులు భరతం పడుతున్నాడు. కరీంనగర్ లో ముగ్గురు టాప్ లీడర్లు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ ముగ్గురు లీడర్లు ఇప్పుడు అవినాశ్ ట్రాన్స్ ఫర్ కావాలని బలంగా కోరుతున్నారు. కానీ అక్కడి ప్రజల దృష్టిలో అభిషేక్ హీరో అయిపోయాడు. భూ బాధితులు నిత్యం ఆయన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. సమస్య తన చెవిన పడిందే తడువుగా అభిషేక్ అక్రమార్కులను లోపలేస్తున్నాడు. దీంతో కొందరు అక్రమార్కులు భూ బాధితులను తాము నొక్కేసిన భూములను తిరిగి అప్పగించేస్తున్నారట. అవసరమైతే కొంత డబ్బు కూడా వారికి ఇస్తున్నారట. దయచేసి అభిషేక్ దగ్గరకు వెళ్లొద్దని వేడుకుంటున్నారట. ఈ లెక్కన అభిషేక్ జిల్లాలో ఏ రేంజ్ లో అక్రమార్కులకు చమటలు పట్టించాడో అర్థం చేసుకోవచ్చు.

రంగనాథ్.. ప్రజల పోలీస్
ఏవీ రంగనాథ్ 1996 కు చెందిన గ్రూప్ 1 ఆఫీసర్. 2006 లో ఐపీఎస్ గా ప్రమోట్ అయ్యారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ప్రజల మన్ననలు పొందారు రంగనాథ్. ప్రజల కోణంలోనే ప్రతి సమస్యలను డీల్ చేయడం ఆయన స్టైల్. ఇక నాయకులను సైతం కన్విన్స్ చేసి తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. వరంగల్ లో ఆయన పనిచేసిన సమయంలో చిట్ ఫండ్స్ బారి నుంచి పేద ప్రజలను కాపాడారు. ఎంతోమంది పేదలకు తాము పోగొట్టుకున్న డబ్బును తిరిగిఇప్పించాడు. చిట్ ఫండ్స్ అక్రమాలు వెలికితీశారు. భూ బకాసురుల నుంచి పేద ప్రజలను కాపాడారు ఏవీ రంగనాథ్. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా కొనసాగుతున్న రంగనాథ్ తన మార్క్ పనితీరు కనబరుస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయడం లేదు. తాజాగా దానం వివాదమే అందుకు నిదర్శనం. హైదరాబాద్ లో చెరబడ్డ చెరువులను కాపాడేందుకు ముఖ్యమంత్రి హైడ్రా తీసుకొచ్చారు. దీన్ని రంగనాథ్ సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆయన మరికొన్ని రోజలు ఇంతే పవర్ ఫుల్ గా కొనసాగితే హైదరాబాద్ లో చెరబడ్డ చెరువులన్నీ రక్షించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img