సత్యం డైరెక్టర్ , బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన అంత్య క్రియలు జరుగనున్నాయని సమాచారం. సూర్య కిరణ్‌కు తమిళ, తెలుగు చిత్ర సీమలో మంచి పేరున్న సంగతి తెలిసిందే. అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్‌గానూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. గత కొంత కాలం నుంచి పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు సమాచారం. తెలుగులో సత్యం, ధన 51, రాజు భాయ్ వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ను తెచ్చుకున్నారు సూర్యకిరణ్. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన అరసి చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతే కాకుండా బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్య కిరణ్.. వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నాడు.
అయితే దర్శకుడుగా వరుస ఫెయిల్యూర్స్ రావడంతో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణికి దూరం కావడంతో.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు సూర్య కిరణ్. 2016లో కళ్యాణి, సూర్య కిరణ్‌లు విడాకులు తీసుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సూర్య కిరణ్.. 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ తరువాత కూడా సూర్య కిరణ్ మళ్లీ తెరపైకి రాలేకపోయారు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం తన పర్సనల్ లైఫ్ విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు సూర్య కిరణ్. కళ్యాణి నా అమ్మ తరువాత అమ్మ. ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉన్నాను.. నా ఇద్దరు చెల్లెల్ని ఎలాగైతే భావిస్తానో.. కళ్యాణి అంటే అంతే ఇష్టం, ప్రేమ. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేను తనకి అవసరం లేదని అనిపించేదేమో కానీ.. నాకైతే ఆమె ఇప్పటికీ ఎప్పటికీ కావాలనే ఉంది. భార్య భర్తల బంధం అనేది.. తెంచేస్తే తెగిపోయేది కాదు.. మా విడాకులు మా ఇద్దర్నీ వేరుచేసినా మనసుల్ని మాత్రం మెలిపెడుతూనే ఉంటుంది.
ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం అంటే. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. నా భార్య స్థానం కళ్యాణిదే. ఇప్పటికీ నా ఫోన్లోనూ.. ల్యాప్ ట్యాప్లోనూ కళ్యాణి ఫొటోనే ఉంటుంది. అంత ఇష్టం ఆమె అంటే. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే’ అని చెప్పి ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సూర్య కిరణ్. కాగా.. ఓ వైపు ఇండస్ట్రీకి దూరం కావడం.. ఒంటరి జీవితం.. బాగా డిప్రెషన్లోకి వెళ్లిన సూర్య కిరణ్.. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకి పచ్చకామెర్లు ముదరడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆయనకి తీవ్రమైన గుండెనొప్పి రావడంతో.. కన్నుమూసినట్టు తెలుస్తోంది.